రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హంతకులను గెలిపించొద్దని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జిల్లా(YSR District) కాశినాయన మండలం(Kashinayana Mandal) అమగంపల్లి(Aagampally)లో బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
బస్సు యాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హత్యారాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. హత్యా రాజకీయాలు చేసే అవినాష్‌ను, ఆయన్ను కాపాడుతున్న జగన్ రెడ్డిని ఇద్దరినీ ఓడించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని మండిపడ్డారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ మనిషి అని, ఆయన కాంగ్రెస్ సాయంతోనే ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని, విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదన్నారు. బీజేపీ దగ్గర జగన్ ఒక బానిసలా మారారని విమర్శించారు.
‘పోలవరం పూర్తికాలేదు.. కడపలో స్టీల్ ప్లాంట్ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.. వైఎస్ఆర్ ఉండి ఉంటే అది పూర్తయ్యేవి..’ అని షర్మిల అన్నారు. ప్రజల భవిష్యత్ బావుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. వివేకా హత్య కేసులో ఉన్న వారికి ఎంపీ టికెట్ ఇవ్వడం వల్లే తాను కడప నుంచి పోటీకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.
చట్టసభలకు హంతకులను పంపించొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. వైఎస్సార్ బిడ్డగా ఆదరించి గెలిపించాలని కోరారు. అదేవిధంగా వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ.. ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలను ప్రజలంతా దీవించాలని కోరారు. తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఆమెను ఎంపీగా చేయాలనేది వివేకా చివరి కోరికని.. దాన్ని నెరవేర్చాలన్నారు. అవినాష్ రెడ్డిని ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు.