పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ(BJP) ప్రచారంలో దూకుడును పెంచింది. రాష్ట్రంలోని పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇప్పటికే ఎంపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(G.KISHAN REDDY) తన సొంతనియోజకవర్గమైన అంబర్ పేటలో పర్యటిస్తున్నారు. బీజేపీ ప్రచార వాహనంలో పర్యటిస్తూ బీజేపీ కి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం(AIMIM) ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 80 శాతం వరకు ఓటింగ్ నమోదు అవుతున్నదని, మీరు కూడా బయటకు వచ్చి ఓటు వేయాలన్నారు. ఈసారి ఎలాగైనా ఓటింగ్ పర్సంటేజీ పెరిగేలా చూడాలని ప్రజలకు సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నదని తెలిపారు.
అయోధ్య రామాలయాన్ని నిర్మించిందని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడంతో పాటు పాకిస్తాన్‌ను ఏకాకిని చేసిందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఉగ్రదాడులు ఎక్కువగా జరిగేవని, ఇప్పుడు ఆ బాధ లేదని వెల్లడించారు. దేశంలో డిజిటలైజేషన్ పెరిగిందని, మహిళలకు జన్‌ధన్ ఖాతాలు ఓపెన్ చేశామన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉందని, మరోసారి మోడీ ప్రభుత్వాన్ని కేంద్రంలో తీసుకువస్తే త్వరలోనే మూడవ స్థానానికి చేరుకుంటామన్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ఐదు వందల ఏళ్లుగా ఎదురుచూశామని, చివరకు మోడీ వచ్చాక ప్రతీ భారతీయుడి కలలను నెరవేర్చాడన్నారు. అందుకే ఈాసారి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు.