రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓడిపోయిందని, పార్టీ కార్యకర్తలు బాధపడవద్దని, రాబోయే ఎన్నికలు పార్టీకి కలిసి వచ్చే రోజులన్నాయని ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు (Name Nageswara Rao) ఉత్సాహాన్ని నింపేలా వ్యాఖ్యానించారు. తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) మోసపూరిత ప్రకటనలతో అధికారం చేపట్టిందని విమర్శించారు. వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు.
ఖమ్మం (Khammam) జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఎంపీ.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లోనే ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని అనుకొంటున్నట్లు పేర్కొన్నారు..
రాబోయే పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం నాయకులు కార్యకర్తలు వర్గాలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంట్ లో తెలంగాణ వాణి వినిపించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మన బాధలు పెద్దలకు తెలియాలంటే గులాబీ జెండా ఎగరాలని నాగేశ్వరరావు అన్నారు..
రాష్ట్రంలో జిల్లాలో సాగునీరు తాగునీరు లేక రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పట్టించుకునే నాధుడే లేడని నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోని నేతలు అధికారంలో ఉండి ఏం లాభమని విమర్శించారు..