లోక్సభ ఎన్నికలు(Loksabha Elections) దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై నజర్ పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ ఎన్నికల శిక్షణ(Election Training)కు కొందరు ఉద్యోగులు డుమ్మా కొడుతున్నారు. దీంతో కలెక్టర్లు(Collectors) దీనిపై సీరియస్గా స్పందిస్తున్నారు.
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 4,5 తేదీల్లో ఎన్నికల నిర్వహణ పై శిక్షణకు 20 శాఖలకు సంబంధించిన 71 మంది గైర్హాజర్ అయ్యారు. ఈ విషయం ఆదిలాబాద్ కలెక్టర్(Adilabad Collector) రాజర్షి షా(Rajarshi shah) దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్గా స్పందించారు. ఎన్నికల శిక్షణకు హాజరు కాని 71మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారు ఎందుకు హాజరు కాలేదో వారందరూ కారణం చెప్పాలని అందులో పేర్కొన్నారు.
ఎన్నికల శిక్షణకు హాజరు కాకపోతే కోడ్ నియమాలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన శిక్షణకు గైర్హాజరైన 144మంది వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆ శాఖ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహణ నేపథ్యంలో మంగళవారం అధికారులకు శిక్షణ ఏర్పాటు చేశారు.
జిల్లా విద్యాశాఖకు చెందిన 84 మంది ఉపాధ్యాయులు, ఇతర విభాగాలకు చెందిన 40 మంది ఉపాధ్యాయులు శిక్షణకు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతరావు సీరియస్ అయ్యారు. గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో డీఈవో దుర్గాప్రసాద్ 84మంది ఉపాధ్యాయులకు, డీఈవో రవికుమార్ ఏడుగురు లెక్చరర్లకు, ఇతర శాఖల ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.