జనసేనకు(Janasena) ఆ పార్టీ విజయవాడ పశ్చిమ ప్రాంత ఇన్‌చార్జిగా ఉన్న పోతిన మహేష్(Pothina Mahesh) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆవేశంలోనో, సీటు రాలేదనో రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. పవన్ కొత్తతరం నేతలను తయారు చేస్తారని ఆయనతో గుడ్డిగా అడుగులు వేశామని, 2014లో పోటీ చేయక పోయినా.. 2019లో ఒక సీటు వచ్చినా పవన్‌తో నడిచి మేం భంగపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేనలో పనిచేసే ఎవరికీ టికెట్లు ఇవ్వకుండా టీడీపీ వారికి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోతిన మహేష్. రాజకీయాల్లోకి వచ్చి తాము ఆస్తులను అమ్ముకుంటే పవన్ కొన్నాడని ఆరోపించారు. దానికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయన్నారు. వాటిని త్వరలోనే బయటపెడతానన్నారు. పవన్ కల్యాణ్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. కాపు సామాజిక వర్గాన్ని బలితీసుకున్నారని, ఇప్పటికైనా తమ గొంతు కోయడం ఆపాలని హితవు పలికారు.
నటించేవాడు నాయకుడు కాలేడని, నమ్మకం కలిగించేవాడు మాత్రమే నాయకుడన్న ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్ అంటూ ఆరోపించారు. పవన్ గురించి తనకంటే ప్రజలకే బాగా తెలుసని, అందుకే ఆయన్ను రెండు చోట్ల చిత్తుగా ఓడించారని అన్నారు. 25 ఏళ్ల భవిష్యత్ ఉందన్న పార్టీకి పవన్ 25సీట్లు కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. పవన్ స్వార్థానికి తమ కుటుంబాలు బలవుతున్నాయన్నారు. జనసేన పార్టీ ఇంకో 20 ఏళ్లు కొనసాగుతుందనే నమ్మకం ఎవరికీ లేదన్నారు.
ఆ పార్టీకి త్వరలోనే కాలం చెల్లుతుందని జోస్యం చెప్పారు. జనసేన ప్రజారాజ్యం పార్టీ 2 అవుతుందని.. 12నెలల్లో జనసేన పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. ఇలాంటి పాషాన హృదయం కలిగిన వ్యక్తితో ప్రయాణం చేసినందుకు మాపై మాకే అసహ్యం కలుగుతోందన్నారు. పార్టీ నిర్మాణం, క్యాడర్ పై ఎప్పుడూ పవన్ కల్యాణ్ దృష్టి పెట్టలేదని మహేష్ ఆరోపించారు. పవన్ ది అంతా నటనే అని దుయ్యబట్టారు. ఆయన నిర్ణయాలన్నీ తాత్కాలికమేని ఒక్కమాట మీద నిలబడరని అన్నారు. పవన్‌ను నమ్మి నట్టేట మునిగామంటూ ఆక్రోశాన్ని వెల్లగక్కారు.
జనసేన వీర మహిళలను మోసం చేయాలని పవన్‌కు ఎలా అనిపించిందని ప్రశ్నించారు. పవన్ టీడీపీలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని టికెట్లను ఇచ్చారని ఆరోపించారు. త్యాగాలు చేయడానికి బీసీలు మాత్రమే కావాలా? అని నిలదీశారు. భీమవరం సీటు కూడా జనసేనకు ఇవ్వకుండా టీడీపీకి ఎందుకు ఇచ్చారు? అంటూ ప్రశ్నించారు. పవన్ నడవడికలో లోపం ఉందని, ఆయన చూపులోనే ద్వంద్వ అర్థాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్‌కు నాయకత్వం అంటే అర్థం తెలియదని, అది తెలిస్తేనే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. మేడిపండుకు ఆయనకు పెద్ద తేడా లేదంటూ సెటైర్ వేశారు. పవన్ ప్రజలకు ఏదో చేస్తారని, ఆయన ఒక చెగువేరాలా ఉన్నాడనుకుని మోసపోయామంటూ ఆవేదన వెల్లగక్కారు. కన్న తల్లిని దూషించిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించారని, నాలుగు పచ్చనోట్ల కట్టలు పడేస్తే కన్నతల్లిని తిట్టిన తిట్లు మర్చిపోతారా? అంటూ మండిపడ్డారు. టీడీపీ వేసిన కుక్క బిస్కెట్లు తీసుకునే 10 స్థానాలు తీసుకున్నారా? అంటూ ధ్వజమెత్తారు. పవన్ కంటే కసాయి వాడేనయమని, తమపై ఆయనకు కనీసం కనికరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గెలిచే భీమవరం నుంచి సీటు పిఠాపురానికి ఎందుకు మార్చుకున్నారని ప్రశ్నించారు. భీమవరంలో సొంత ఇంటి నిర్మించుకోవడానికి ఎమ్మెల్యే అడ్డుకున్నారనడం అవాస్తవమని తెలిపారు. నాగబాబు అనకాపల్లి నుంచి అంత అర్జంట్ గా ఎందుకు తప్పుకున్నారో చెప్పాలన్నారు. జనసేన బస్సును నాదెండ్ల మనోహర్ చేతిలో పెట్టారని, ఆ బస్సు ఘోరంగా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని, అందులో తాము గాయాలపాలయ్యామని వ్యాఖ్యానించారు. ‘రాజధాని ప్రాంతంలో జనసేనను నేను బతికిస్తే పవన్ నన్ను చంపేశాడు.. రేపటి నుంచి నాది పునర్జన్మ.. నాకు నచ్చిన జెండా మోస్తా..’ అంటూ పోతిన మహేష్ అన్నారు.