రాష్ట్రంలో పలు సంచలనాలకు తెరలేపిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం చంచలగూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాధాకిషన్ రావు (Radakishan Rao) రిమాండ్ పూర్తవ్వడంతో ప్రత్యేక విచారణ బృందం అధికారులు ఆయన్ను బుధవారం ఉదయం నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన ఆధారాలు ధ్వంసం అయ్యాయి. అందులో రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు కీలక హస్తం ఉన్నదని అధికారులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు ఈనెల 12 వరకు మరోసారి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
అంతకుమందు ఫోన్ ట్యాపింగ్ కేసులు కీలక పాత్రధారిగా ఉన్న రాధాకిషన్ రావు కోర్టులో పలు విషయాలను ప్రస్తావించారు. జైలులోని లైబ్రరీకి వెళ్లేందుకు, జైలు
సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో జైలు అధికారులను పిలిపించి నాంపల్లి కోర్టు ప్రశ్నించింది.
లైబ్రరీతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేలా అనుమతి నిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. రాధాకిషన్ రావుకు మరోసారి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్నుఅధికారులు జైలుకు తరలించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో దశాబ్దాల కాలం నాటి డేటాను ప్రణీత్ రావు ధ్వంసం చేయడంతో ఎంతో విలుమైన సమాచారం పోయిందని, వాటిని బ్యాకప్ చేయడం సాధ్యం కాకపోవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.