ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) , వివేకానంద రెడ్డి కుమార్తె సునీత(Sunita)లపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మేనత్త విమలారెడ్డి(Vimalareddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. వైఎస్ కుటుంబంలోని ఆడపడుచులు అన్యాయంగా మాట్లాడుతూ వైఎస్ఆర్(YSR) పరువు రోడ్డు మీదకు తెస్తున్నారని మండిపడ్డారు.
తానూ వైఎస్ఆర్ ఇంటి ఆడపడుచుగా ఇప్పుడు మాట్లాడుతున్నానని తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డి(Avinashreddy) హత్య చేస్తుంటే షర్మిల, సునీత చూశారా? అని సూటిగా ప్రశ్నించారు. వాళ్లిద్దరూ చేస్తోంది తప్పు అని, మంచేదో, చెడు ఏదో కడప ప్రజలకు గ్రహించాలని సూచించారు. వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్కా చెల్లెళ్లు ఇప్పటికైనా నోరు మూసుకోవాలని సూచించారు. షర్మిల, సునీత వ్యక్తిగతంగా కక్ష్య పెట్టుకుని వైఎస్ జగన్ను ఇందులోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరికీ దైవ భయం పోయిందని అన్నారు.
జగన్ శత్రువులు అంతా షర్మిల చుట్టూ చేరారంటూ దుయ్యబట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి కడపను ఎంతో అభివృద్ధి చేశారని, ఆయన ఇంతవరకు షర్మిలను కానీ, సునీతను కానీ ఒక్కమాట అనలేదని చెప్పుకొచ్చారు. ఆస్తులు ఈడీ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇస్తానని షర్మిలకు వైఎస్ జగన్ చెప్పారని అన్నారు విమలారెడ్డి.