పార్లమెంట్ ఎన్నికల వేళ పొలిటికల్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విజయం మాదంటే మాదని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో తన గెలుపుపై ఎంఐఎం (MIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్లో బీజేపీ తప్పక ఓడిపోతుందని ఓవైసీ అన్నారు. శనివారం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఓవైసీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న మత రాజీకీయాల కారణంగా హైదరాబాద్ ప్రజలు ఆ పార్టీని నమ్మరని తెలిపారు. మతం ప్రాతిపదికన సీఏఏ చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు.
సమానత్వ హక్కు చట్టానికి ఇది పూర్తిగా విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. సీఏఏ పై ఎంఐఎం పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని అసదుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు సైతం సీఏఏ(పారసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా ఓటు వేయాలని అసదుద్దీన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజలు ఓటు వేయాలని, ఇతర పార్టీలను కూడా ఓడించాలని ఓవైసీ పిలుపునిచ్చారు. కాగా, హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరఫున మాధవీలత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.