రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తమదేనని, బీజేపీ(BJP) జాతీయ సెక్రటరీ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(MP Bandi sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తున్న విధంగా ఫలితాలు ఉండబోవని, బీజేపీకి 17 సీట్లు వస్తాయని బండి సంజయ్ జోస్యం చెప్పారు.
ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) నడుస్తుండగా.. త్వరలోనే TPL( తెలంగాణ పొలిటికల్ లీగల్ కప్) ప్రారంభం అవుతుందని, అందులో రాష్ట్రంలోని బీజేపీ మొత్తం 17 సీట్లనూ కైవసం చేసుకుంటుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి.. ఈ ఎన్నికల టోర్నమెంట్‌కు కాంగ్రెస్ పార్టీకి ప్లేయర్లు (ఎంపీ అభ్యర్థులు) కరువయ్యారని ఎద్దేవా చేశారు. టీమ్ సభ్యులున్నా బీఆర్ఎస్ అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను గెలిచి టీపీఎల్(తెలంగాణ పొలిటికల్ లీగల్ కప్)ను బీజేపీ సొంతం చేసుకుంటుందని బండి జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. అటువంటి పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని బండి సంజయ్ స్పష్టంచేశారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రూ.12వేల కోట్లను కేటాయించిందని, ఆర్టికల్ 370 రద్దు చేసిందని, అయోధ్యలో రామాలయం, త్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిందని చెప్పుకొచ్చారు.