పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా బీజేపీ ‘సంకల్ప పత్ర’ (Sankalpa Patra) పేరుతో మేనిఫెస్టో(manifesto)ను ఆదివారం విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా భారత్ యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతుందనే దానిపై ప్రధానంగా ఫోకస్ చేసినట్లు బీజేపీ పెద్దలు పేర్కొన్నారు.
2047 విజన్ భారత్ పేరిట రాబోయే పదేండల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో కీలక అంశాలను ప్రస్తావించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ‘సంకల్ప పత్ర’ మేనిఫెస్టోను బీజేపీ తీసుకొచ్చింది.
ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలపై ఫోకస్ చేశారు. అందులో ఒకటి ‘యువశక్తి, నారీశక్తి, గరీబ్ యోజన, కిసాన్ యోజన’ ఉన్నాయి. ఇక యువ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోను తయారు చేసినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఇదిలాఉండగా మరో కీలక అంశంపై ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు.
గత దశాబ్దకాలంలో జమిలి ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరుగుతూ వస్తోంది. ఎన్నికల్లో నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు దేశంలో జమిలి ఎన్నికల(Jamili Elections)ను తీసుకు రావాలని కేంద్రం భావిస్తున్నది. దీనిపై తాజాగా ప్రధాని మోడీ(PM MODI) స్పష్టత నిచ్చారు.
భవిషత్య్‌లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. అంటే 2029లో జమిలి ఎన్నికల నిర్వహణ ఉంటుందని మోడీ చెప్పకనే చెప్పారు. ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతిఅంశాన్ని నేరవేర్చుతూ వచ్చింది. ఈసారి ప్రధాని ఇంత నమ్మకంగా జమిలిపై ప్రకటన చేశారంటే తప్పకుండా వచ్చే ఐదేళ్లలో ఆ దిశగా తప్పక చర్యలు ఉంటాయని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే పలు సర్వేలు మరోసారి కేంద్రంలో బీజేపీ వస్తుందని కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే.