తెలంగాణలో సిరిసిల్ల(Sirisilla) చేనేత(Handloom) పరిశ్రమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎంతో మంది చేనేత కళాకారులు వివిధ రకాల చీరలను అద్భుతంగా నేసి తమ ప్రతిభను కనబరిచారు. తాజాగా మరో కళాకారుడు చేనేత కళతో అందరి దృష్టిని ఆకర్శించాడు. బంగారు నూలు పోగులతో మూడు రంగుల్లో త్రీడీ చీరను మగ్గంపై నేసి అబ్బురపరిచాడు.
ఈ చీరను శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి కల్యాణానికి సీతమ్మకు కానుకగా పంపడానికి సిద్ధం చేశాడు. సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్(Nalla Vijay Kumar) ఆదివారం ఈ పట్టు చీరను ఆవిష్కరించాడు. 18 రోజులపాటు మగ్గంపై ఈ చీరను నేసినట్లు తెలిపాడు. ఈ చీరను ఐదున్నర మీటర్ల పొడవు, 48అంగులాల వెడల్పు, 600గ్రాముల బరువుతో తీర్చిదిద్దాడు.
బంగారం, వెండి జరి, ఎరుపు రంగులతో అత్యద్భుతంగా తయారు చేశాడు. ఈ త్రీడీ చీరను తిప్పుతుంటే మూడు వర్ణాల్లో రంగులు మారుతుండటం విశేషం. ఏప్రిల్ 17(బుధవారం) జరగనున్న శ్రీరామ నవమి పండుగకు భద్రాచలం సీతారాముల వివాహమహోత్సవానికి ఈ చీరను బహూకరించనున్నట్లు విజయ్ కుమార్ తెలిపాడు.
విజయ్‌కుమార్ ఇలాంటి చీరలను నేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ అగ్గిపెట్టెలో ఇమిడే, ఉంగరంలో దూరే పట్టుచీరలను అద్భుతంగా తయారు చేసి అందరి ప్రశంసలు పొందాడు. తాజాగా భద్రాద్రిలో జరిగే కల్యాణ మహోత్సవంలో ఈ చీర ప్రత్యేక ఆకర్శణగా నిలవనుంది.