ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam Case)లో జైలు శిక్ష అనుభవిస్తున్న అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) , లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా(Vinay kumar Saxena) మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఈసారి ఢిల్లీలో నీటి సరఫరాపై తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు వీకే సక్సేనా బహిరంగ లేఖ రాశారు. ఈ సమస్యకు మీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
నీటి పోరాటంలో ఓ మహిళ మరణాన్ని నీటి మంత్రి అతిషి(Minister Athishi) ‘సంకుచిత రాజకీయ ప్రయోజనాల’ కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఇలాంటి దురదృష్టకర ఘటన ఒక్కటే కాదని, నీటి కొరతకు సంబంధించి గతంలో ఇలాంటి అనేక ఘటనలు జరిగాయన్నారు. ప్రభుత్వం ఉచిత నీటి భ్రమను సృష్టించిందని, మహిళ మరణంతో ఇది బహిర్గతమైనట్లు స్పష్టం చేశారు.
లెఫ్టినెంట్ గవర్నర్ మాట్లాడుతూ అతిషి తొమ్మిదేళ్లకు పైగా తన సొంత ప్రభుత్వాన్ని నిందించారని, ఈ సంఘటన వెనుక నీటి సరఫరా లోపమే కారణమని ఎత్తి చూపారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే నీటి ఎద్దడిపై గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయన్నారు. నీటి సమస్య పరిష్కారానికి బదులు కేజ్రీవాల్, మంత్రులు ఉచిత నీటి కల్పనను సృష్టించారని ఆయన లేఖలో రాశారు.
లెఫ్టినెంట్ గవర్నర్ లేఖతో పాటు కొన్ని వార్తల క్లిప్పింగులను కూడా జత చేశారు. తాగునీటి విషయంలో ఢిల్లీ కంటే ముంబై, చెన్నై, పుణె నగరాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కష్టాల్లో నెట్టుకొస్తున్నకేజ్రీవాల్ను వీకే సక్సేనా లేఖతో రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం గమనార్హం.