పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు విజయకోసం తహతహలాడుతున్నాయి. అందుకోసం ఒకరిమీద మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అధికార కాంగ్రెస్ పార్టీ(CONGRESS), బీజేపీ(BJP)పై ఘాటు విమర్శలు చేశారు. మంగళవారం చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్..
ముందుగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల టైంలో సీఎం రేవంత్ రెడ్డి(Cm revanth ReddY) దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని..పార్లమెంట్ ఎన్నికల వేళ పార్ట్-2 మోసం పేరిట మరోసారి ఓట్లు అడగడానికి వస్తున్నారని ఎద్దేవాచేశారు.
ఎంపీ ఎన్నికల్లో గెలించేందుకు మరోసారి రుణమాఫీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. గతంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక రుణమాఫీ చేస్తానని చెప్పారు.ఇప్పుడు ఆగస్టు 15న చేస్తామని మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు ఒకసారి మోసపోతే అది నాయకుల తప్పు అవుతుంది..రెండోసారి కూడా మోసపోతే అది ముమ్మాటికీ ప్రజలదే తప్పని అన్నారు. రెండోసారి కూడా మోసపోదామా? అని ఓటర్లను ప్రశ్నించారు.
ఇక బీజేపీ వాళ్లు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, అసలు తెలంగాణకు ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలన్నారు. కేవలం జై శ్రీరామ్ పేరుతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని..‘రాముడు బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో’ కాదని.. రాముడు అందరి వాడని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకే ఓటేయాలని పిలుపునిచ్చారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు.