జింబాబ్వే(Zimbabwe) మాజీ క్రికెటర్ గై విట్టాల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ మాజీ ఆల్‌రౌండర్‌పై హరారే సమీపంలోని బఫెలో రేంజ్లో ఓ చిరుత దాడి చేసింది. అయితే, ఆ దాడి నుంచి విట్టాల్ తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య హన్నా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
జింబాబ్వేకు చెందిన 51 ఏళ్ల మాజీ ఆల్ రౌండర్ గై విట్టాల్ (Guy Whittall) ఇటీవల హ్యూమని ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. అతడితో పాటు పెంపుడు శునకం చికారాను కూడా తీసుకెళ్లాడు. పర్వతారోహణ సమయంలో హఠాత్తుగా ఓ చిరుత విట్టాల్‌పై దాడి చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన చికారా యజమానిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.
క్రికెటర్‌ను రక్షించే ప్రయత్నంలో అది కూడా తీవ్రంగా గాయపడింది. రక్తమోడుతున్నా పోరాడి విట్టాల్‌ను కాపాడింది. చిరుతను తరిమికొట్టింది. ఈ ఘటనలో విట్టాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే విట్టాల్, చికారాను విమానంలో ఆస్పత్రికి తరలించారు. ఆ మూగజీవం గాయాల నుంచి కోలుకుంటోంది. తీవ్ర గాయాల కారణంగా విట్టాల్‌కు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందనీ.. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు హన్నా స్టూక్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను హన్నా స్టూక్స్ షేర్ చేశారు. గతంలోనూ ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకొంది. 2013లో విట్టాల్ ఇంట్లోకి పెద్ద మొసలి చొరబడి మంచం కిందకు వెళ్లింది. ఆ విషయాన్ని ముందుగానే గమనించడంతో అతడికి ప్రాణాపాయం తప్పినట్లు ఆమె తెలిపారు.