అమెరికా(America)లోని టాప్ వర్సిటీల్లో ప్రస్తుతం ఇజ్రాయిల్(Israel)కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఇజ్రాయిల్ మిలిటరీ చర్యల వల్ల గాజా(Gaza)లో జరుగుతున్న వైమానిక దాడులకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇటీవల న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు.
ఇందులో అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదువుతున్నభారతీయ విద్యార్థులు ఉన్నారు. పాలస్తీనా అనుకూల నిరసన ప్రదర్శనలో వీరు పాల్గొన్నారు. అయితే ఆ వర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో హసద్ సయ్యద్ అనే విద్యార్థితో పాటు భారతీయ విద్యార్థిని అచింత్య శివలింగన్‌ను(Achinthya Sivalingan) స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.
ప్రిన్స్టన్ వర్సిటీలోని పబ్లిక్ అఫైర్స్ ఇన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్‌లో అచింత్య శివలింగన్ మాస్టర్స్ చదువుతోంది. ఇక సయ్యద్ అనే వ్యక్తి ఆ వర్సిటీలోనే పీహెచ్డీ చేస్తున్నాడు. వర్సిటీ క్యాంపస్‌లో టెంట్లు వేసేందుకు నిరసనకారులు ప్రయత్నించారని వర్సిటీ అధికారులు ఆరోపించారు. టెంట్లు వేయొద్దని ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా ఆ విద్యార్థులు పట్టించుకోలేదని తెలిపారు.
దాంతో వాళ్లను అరెస్టు చేయాల్సి వచ్చినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు వర్సిటీ నిబంధనలు పాటించని విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపారు. వర్సిటీ నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు గ్రాడ్యుయేట్ విద్యార్థులను అరెస్టు చేసి, తక్షణమే వాళ్లను క్యాంపస్‌ను డిబార్ చేసినట్లు వర్సిటీ ప్రతినిధి జెన్నిఫర్ మోరిల్ తెలిపారు.