మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish rao) తాను చెప్పినట్లుగానే శుక్రవారం ఉదయం గన్‌పార్క్(Gun park) వద్దకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్(Political Sawal)ను తాను స్వీకరించానని, మరి రేవంత్ రెడ్డి తన సవాల్ స్వీకరించి వస్తారా? రారా? అనేది క్లారిటీ ఇవ్వాలని కోరారు. అయితే, అంతకుముందు హరీశ్ రావు గన్ పార్కుకు వస్తున్నారని తెలిసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మొహరించారు.
గన్ పార్కు వద్దకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కాసేపు పోలీసులతో హరీశ్ రావు వారించినట్లు తెలిసింది. అనంతరం హరీశ్ రావు గన్ పార్కు వద్ద ఉండి మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి సవాల్‌ను నేను స్వీకరించి గన్‌పార్క్ వద్దకు వచ్చాను.సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా వదలకుండా ప్రమాణాలు చేస్తున్నారు. నా రాజీనామా పత్రం రెడీగా వుంది.
ఆగస్టు 15లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు ఇస్తారా? రేవంత్ సీఎం అయ్యాక ఒక్కసారి కూడా గన్‌పార్క్ అమరవీరులకు నివాళులు అర్పించలేదు. ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసే బాధ్యత మాకుంది.
ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ లేఖ రాశారు.
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ,ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయను.రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను తన స్టాఫ్‌తో నైనా పంపించాలి. నేను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను ఇస్తున్నా.
మా రాజీనామా లేఖను జర్నలిస్టులకు ఇచ్చి వెళ్తున్నా’ అని హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.