మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన సోమవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్(BRS)పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో బీఆర్ఎస్ మూతపడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవదని జోస్యం చెప్పారు.
నమ్మించి మోసం చేయడం కేసీఆర్ నైజమని కడియం మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. కవితపై బీజేపీ కుట్రతో కేసులు పెట్టిందంటున్న కేసీఆర్ అంటున్నారని, తప్పు చేయకుండా ఎవరినీ జైలులో పెట్టరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. లిక్కర్ కేసులో కవిత అరెస్టవడం సిగ్గుచేటన్నారు. కవిత వల్లే కేజ్రీవాల్ ఈ కేసులో ఇరుక్కున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా సీఎంకు సంబంధం లేకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలను కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిందని కడియం ఆరోపించారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ కష్టమని అన్నారు. బీఆర్ఎస్ ఓటింగ్ శాతం 20 శాతానికి పడిపోయిందని తెలిపారు. బీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో మూడోస్థానంలో ఉందన్నారు. బీజేపీ కంటే ఆ పార్టీ వెనుకబడిందంటూ విమర్శించారు. వరంగల్‌ను ఆరు ముక్కలు చేసిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారంటూ మండిపడ్డారు.
ఆరూరి రమేష్‌కు వరంగల్ చుట్టూ వందల ఎకరాల భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కబ్జాల వల్లే ఇదంతా సాధ్యమైందని దుయ్యబట్టారు. రాజయ్య మీద ప్రేమ ఉంటే వరంగల్ పార్లమెంట్స్ టికెట్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కేసీఆర్ ఎదురుగా ఒక మాట.. లోపల మరో మాట మాట్లాడే నైజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌కు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. వరంగల్‌పై కేసీఆర్‌కు ప్రేమ లేదన్నారు. ఇక్కడ ప్రశ్నించేవారు ఎక్కువగా ఉండటం వల్ల కేసీఆర్‌కు వరంగల్ అంటే భయమని అన్నారు.