ప్రపంచానికి కొత్త దిశను చూపేందుకు 21వ శతాబ్దం అత్యంత ముఖ్యమైన సమయం అని ప్రధాని మోడీ అన్నారు. పాత సమస్యలకు ఇప్పుడు కొత్త పరిష్కారాలను వెతకాల్సిన సమయం అన్నారు. దీని కోసం మానవ కేంద్రీకృత విధానంతో మన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
జీ-20 సదస్సులో ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచం ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటోందని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ఇప్పుడు మానవ కేంద్రీకృత విధానం కావాలని ఆయన తెలిపారు. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా ప్రపంచ స్థాయిలో విశ్వాసం లోపించిందన్నారు.
అందువల్ల జీ 20 నేతలంతా కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా లోపించిన విశ్వాసాన్ని పూరించి విశ్వాసాన్ని నింపాలని అధ్యక్ష హోదాలో భారత్ కోరుతోందన్నారు. ఇది మనమందరం కలిసి ముందుకు సాగాల్సిన సమయం అని తెలిపారు.
ఈ సమయంలో సబ్ కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ అనే మంత్రం మనకు మార్గదర్శకంగా వుంటుందన్నారు. అది ఉత్తర దక్షిణ దేశాల మధ్య విభజన అయినా, తూర్పు పడమరల మధ్య దూరమైనా, ఆహారం ఇంధనాల నిర్వహణ, ఉగ్రవాదం, సైబర్ భద్రత, ఆరోగ్యం, ఇంధనం లేదా నీటి భద్రత అయినా భవిష్యత్తు తరాల కోసం మనం వాటికి సరైన పరిష్కారాన్ని కనుగొనవాల్సి ఉందన్నారు.