భారత్ (Bharat) లో జరిగిన జీ20 (G20) సదస్సు విజయవంతంగా ముగిసింది. దీనికి హాజరైన విదేశీ ప్రతినిధులు సైతం భారత్ జీ20 నిర్వహణ చాలా బాగా చేసిందని కితాబు కూడా ఇచ్చారు. కానీ ఈ సదస్సు కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు (G20 Summit Budget) ఇప్పుడు చర్చనీయాంశమైంది.
జీ20 సదస్సు కోసం బీజేపీ ప్రభుత్వం రూ. 4100 కోట్లు ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంత మొత్తం ఖర్చైనట్లు ప్రభుత్వ రికార్డుల ద్వారా వెల్లడైంది. నిజానికి జీ20 సదస్సుల కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కు, పెట్టిన ఖర్చు నాలుగు రెట్లు అధికంగా ఉంది. జీ20 ప్రెసిడెన్సీ కోసం 2023-24 బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 990 కోట్లు కేటాయించగా వ్యయం ఏకంగా నాలుగు రెట్లు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సు విజయవంతం కోసం అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు గత కొద్దినెలలుగా విస్తృత ఏర్పాట్లు చేశారు. పలు దేశాధినేతలు, ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో ప్రతినిధులు తరలి వచ్చారు. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలు దేశాధినేతలు హాజరయ్యారు.
ఇక గతంలో జీ20 సదస్సు నిర్వహణ కోసం పలు దేశాలు భారత కరెన్సీలో చూస్తే ఎంత ఖర్చు చేశాయో పరిశీలిస్తే ఇండోనేషియా 2022లో సదస్సు నిర్వహణ కోసం రూ. 364 కోట్ల ఖర్చు చేసింది. జపాన్ (2019) రూ 2660 కోట్లు, అర్జెంటీనా (2018) రూ. 931 కోట్లు, జర్మనీ (2017) రూ. 634 కోట్లు, చైనా (2016) రూ. 1.9 లక్షల కోట్లు, ఆస్ట్రేలియా (2014) రూ. 2653 కోట్లు, రష్యా (2013) రూ. 170 కోట్లు, ఫ్రాన్స్ (2011) రూ. 712 కోట్లు, కెనడా (2010) రూ.4351 కోట్లు వెచ్చించాయి.
భారత్ నిర్వహించిన జీ 20 నిర్వహణ కోసం మొత్తం 12 విభాగాల్లో రూ.4100 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వ రికార్డుల ప్రకారం వెల్లడైంది.