తెలంగాణా (Telangana) ని వర్షాలు వదలడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం (Hyderabad) ఇటీవల కాలంలో వర్షం (Rains) లో తడిచి ముద్దవుతూనే ఉంది. ఇవాళ కూడా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుండే ఖైరతాబాద్, అమీర్ పేట, పంజాగుంట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండలలో జోరుగా వర్షం కురుస్తోంది. వాహనదారులు, పాదచారులు ఈ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
గురువారం ఆసిఫాబాద్‌లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్‌లో 11.3 సెం.మీ వర్షపాతం కురిసింది. ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, ములుగు, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీకే ఉపరితల గని-2, 3లో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. కే.సముద్రం మండలం అర్పణపల్లి బ్రిడ్జిపై వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో కే.సముద్రం నుంచి గూడూరుకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వాన పడుతుందని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.