Telugu News » TSPSC :  పరీక్ష రద్దు ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది: ఈటల

TSPSC :  పరీక్ష రద్దు ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది: ఈటల

30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు.

by Prasanna
eetala

వరుసగా రెండో సారికూడా గ్రూప్ వన్ పరీక్ష (Group 1 Exam) రద్దవడం మీద హుజూరాబాద్ ఎమ్మెల్యే (MKA), బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajendar) హాట్ కామెంట్స్ చేశారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని విమర్శించారు. పదేపదే పరీక్ష రద్దవడం ఖచ్చితంగా ప్రభుత్వ లోపమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఉద్యోగాల కోసమని ఇప్పుడదే నీరుకారిపోతోందని తెలిపారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు.

eetala

పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో మొదటిసారి గ్రూప్ వన్ పరీక్షలు రద్దవగా, టీఎస్పీఎస్సీ అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను సరిగ్గా సేకరించకపోవడంతో తెలంగాణ హైకోర్టు తాజాగా రెండో సారి పరీక్షను రద్దుచేసిన విషయం తెలిసిందే. పదేపదే పరీక్షలు రద్దవడం తప్ప కేసీఆర్ వచ్చాక ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమయిందన్నారు. కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామనీ, ప్రైవేట్ లో ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్ మాటలు నీటిమీద రాతలని ఎద్దెవా చేశారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు వేస్తే 17 పేపర్లు లీక్ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టిఎస్పిఎస్సి గ్రూప్ 1 పరీక్ష రద్దుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

 

అభ్యర్థుల జీవితాలతో ముడిపడిన ఇలాంటి సున్నితమైన విషయాల మీద సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి, పరీక్షలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలా జరిగినప్పుడే తెలంగాణ కోసం అమరులైన వారికి నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు.

 

You may also like

Leave a Comment