Telugu News » Telangana : విద్యార్థులు, నిరుద్యోగులకు ‘అగ్ని పరీక్ష’

Telangana : విద్యార్థులు, నిరుద్యోగులకు ‘అగ్ని పరీక్ష’

పరీక్షలు సరిగ్గా జరపడం లేదు, పేపర్లు దిద్దడం రావడం లేదు అంటూ కేసీఆర్ సర్కార్ పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

by admin
cm kcr

– అప్పుడు ఇంటర్ విద్యార్థులు బలి
– ఇప్పుడు నిరుద్యోగుల్లో టెన్షన్
– టెన్త్ ఫరీక్షల సమయంలోనూ అంతే!
– ఏ పరీక్ష చూసినా నిర్లక్ష్యమే!
– పరీక్షలు జరపడం రాదు..
– పేపర్లు దిద్దడం రాదు..
– కేసీఆర్ సర్కార్ పై ప్రతిపక్షాల ఆగ్రహం

నీళ్లు, నిధులు, నియామకాలు.. తెలంగాణ (Telangana) ఉద్యమ నినాదం. వీటి కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారు. ముఖ్యంగా ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులది ప్రధాన పాత్ర. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతున్న కొద్దీ అనేక మంది విద్యార్థులు చనిపోయారు. వారి అమరత్వం ప్రజలను తట్టి లేపింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని కలలు కన్నారు విద్యార్థులు, నిరుద్యోగులు. రాష్ట్రమైతే వచ్చిందిగానీ వారు నిలువునా మోసపోయారనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలు సరిగ్గా జరపడం లేదు, పేపర్లు దిద్దడం రావడం లేదు అంటూ కేసీఆర్ (KCR) సర్కార్ పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.

cm kcr wrote letter to pm modi

గ్రూప్-1 (Group-1) పరీక్ష రద్దు నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు, నిరుద్యోగులు. గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహించాక.. టీఎస్పీఎస్సీ (TSPSC) పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. పరీక్షను పకడ్బందీగా నిర్వహించిందని ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ, చివరకు పేపర్ లీకేజ్ వ్యవహారం వెలుగుచూసింది. దీని వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ ఇష్టం లేకే.. కావాలని కాలయాపన చేసేందుకు డ్రామా క్రియేట్ చేశారని విపక్ష నేతలు ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు.

లీకేజ్ వ్యవహారం వివాదాస్పదం కాగా.. మరోసారి పక్కాగా పరీక్ష జరుపుతామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 11న పరీక్ష నిర్వహించింది. అయితే.. ఈ పరీక్ష విషయంలో అభ్యర్థులు ముందు నుంచి అభ్యంతరాలు తెలిపారు. కొంత సమయం ఇవ్వాలని అడిగారు. కానీ, టీఎస్పీఎస్సీ వెనుకడుగు వేయలేదు. వారి అభ్యర్థనను పట్టించుకోలేదు. నిర్ణయించిన తేదీకి పరీక్ష జరిపించింది. చాలా కండిషన్స్ ను తెరపైకి తెచ్చింది. కానీ, బయోమెట్రిక్ విస్మరించింది.. ఇంకా పలు తప్పిదాలతో విమర్శల పాలైంది. చివరకు రెండోసారి కూడా పరీక్ష రద్దయింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీనే రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. పరీక్షలు జరపడం చేతగాని ప్రభుత్వం గతంలో కూడా ఇంటర్ విద్యార్థులను బలి తీసుకుందని గుర్తు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు.

2019లో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని.. ఇది ప్రభుత్వ పాపమేనని అంటున్నారు. ఎన్ని ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వ వైఖరిలో మార్పు ఉండడం లేదని.. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇది శాపంగా మారిందని చెబుతున్నారు. ఆమధ్య టెన్త్ పరీక్షల సమయంలోనూ కొన్ని పేపర్లు బయటకు రావడం వెనుక నిర్వహణా నిర్లక్ష్యం ఉందని మండిపడుతున్నారు. అసలు, పరీక్షలు సరిగ్గా జరపలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన కేసీఆర్.. ఇన్ని సంవత్సరాలవుతున్నా ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. అమాస, పున్నానికి వేసిన నోటిఫికేషన్ కూడా రద్దు చేస్తూ.. తమ జీవితాలను ఆగం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఉస్మానియా యూనివర్సీటీలో ఉంటూ.. అమ్మానాన్నలు అప్పులు చేసి పంపించిన డబ్బులతో చదువుకుంటుంటే, ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ తమను మోసం చేస్తున్నారని అంటున్నారు. వెంటనే టీఎస్పీఎస్సీని రద్దు చేసి.. కొత్త బోర్డ్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇటు సీఎం కేసీఆర్​ ను గద్దె దించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు.. విద్యార్థి నిరుద్యోగ ప్రజా కోర్టును నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఇది జరగనుంది. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని.. ఉన్నత విద్య, ఉద్యోగ ఉపాధి కల్పనలో వైఫల్యం చెందినట్లు ఆరోపిస్తున్నారు. నియామకాల నోటిఫికేషన్లు వేసి లీకులతో పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులను మోసం చేసిందని.. ఓయూ నుంచే విద్యార్థి నిరుద్యోగ ఉద్యమం ప్రారంభిస్తామని అంటున్నారు నిరుద్యోగులు.

You may also like

Leave a Comment