– కవిత పిటిషన్ పై సుప్రీం విచారణ
– ఈడీకి కీలక ఆదేశాలు
– మద్యంతర ఉత్తర్వుల కొనసాగింపు
– నవంబర్ 20 దాకా కవితకు ఊరట
ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కాం కేసు రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అనేలా సాగుతోంది. దర్యాప్తు సంస్థల ప్లాన్స్ వర్కవుట్ కావడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ను మరోసారి విచారిద్దామని అనుకుంటే.. సుప్రీంకోర్టు నుంచి కీలక ఆదేశాలు వెలువడ్డాయి. కవిత వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఈడీ (ED) దర్యాప్తు తీరును తప్పుబడుతూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో దాఖలైన అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసుతో ట్యాగ్ చేసి విచారణ కొనసాగించాలని కోరారు. గత విచారణలో ఈడీ సమన్లను కూడా కవిత తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా సమన్లు జారీ చేయడం తగదన్నారు. నళిని చిదంబరానికి ఇచ్చినట్టే తనకు కూడా వెసులుబాటు ఇవ్వాలని కోరారు. అయితే.. మహిళను విచారణకే పిలవకూడదంటే ఎలా అని సుప్రీం ప్రశ్నించింది. అన్నిటికీ ఒకే ఆర్డర్ ను అప్లై చేయలేమని.. 10 రోజుల పాటు సమన్లు వాయిదా వేసింది. దీనికి ఈడీ కూడా అంగీకరించింది. కవితకు సమన్లు ఇవ్వొద్దని ఈడీకి ఈనెల 15న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మంగళవారం విచారణను కొనసాగించిన సుప్రీం ధర్మాసనం.. కవితకు ఊరటనిచ్చే ఆదేశాలిచ్చింది. నవంబర్ 20వ తేదీన విచారణ చేపడతామని.. అక్టోబర్ 18వ తేదీన పీఎంఎల్ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక విచారణ జరగనున్న నేపథ్యంలో.. అది పూర్తైన తర్వాతే ఢిల్లీ లిక్కర్ స్కాంను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది. దీంతో నవంబర్ 20వ తేదీ వరకు కవితను విచారణకు పిలవబోమని ఈడీ అధికారులు తెలిపారు.
మార్చి నెలలో కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణ కొనసాగింది. అయితే.. మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ అప్పటి నుంచి కవిత చెబుతూ వస్తున్నారు. దీనిపై అప్పుడే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మళ్లీ ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులు జారీ అవడంతో మరోసారి సుప్రీంలో పిటిషన్ వేశారు కవిత. దీనిపై తాజాగా విచారణ జరగగా.. ఆమెకు నవంబర్ 20 వరకు ఊరట లభించింది.