– ముందే జాగ్రత్త పడుతున్న బీఆర్ఎస్
– కారును పోలిన గుర్తులపై ఫోకస్
– ఈసీతో ఎంపీల స్పెషల్ భేటీ
– కారును పోలిన గుర్తులు తొలగించాలని వినతి
తెలంగాణ (Telangana) లో అసెంబ్లీ ఎన్నికలు ఇంకో రెండు, మూడు నెలల్లో ఉండొచ్చిన అధికారులు ఇప్పటికే ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారమే అంతా జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తమకు నష్టం చేకూర్చే అంశాలపై దృష్టి సారించింది. ముందుగా కారును పోలిన గుర్తులపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) తో బీఆర్ఎస్ ఎంపీల బృందం బుధవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది.
గతంలో ఇలాంటి గుర్తుల వల్ల తమ పార్టీకి రావాల్సిన ఓట్లు కోల్పోయినట్లు ఎంపీలు ఎన్నికల సంఘానికి తెలియజేశారు. ఈ విషయాన్ని గతంలో కూడా ఈసీ దృష్టికి తాము తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇటీవల పలు గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించిన గుర్తుల్లో కారు గుర్తును పోలిన విధంగా ఉన్న వాటి విషయంలో పునః సమీక్ష చేయాలని ఎంపీలు కోరారు.
సాధారణంగా రిజిస్టర్డ్ పార్టీలకు గుర్తుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే.. గుర్తించబడని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్ ను సూచిస్తుంది. వాటిలో ఓ గుర్తును ఎంచుకోవాలని అభ్యర్థులకు చెబుతుంది. అయితే.. గత కొన్ని ఎన్నికల నుంచి బీఆర్ఎస్ గుర్తైన కారును పోలినవి ఫ్రీ సింబల్స్ లో ఎక్కువగా ఉంటుండడం ఆపార్టీకి తలనొప్పిగా మారింది. కారు లాగే కనిపించే సింబల్స్ ను ఇతరులకు కేటాయించవద్దని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని ఎప్పటినుంచో గులాబీ దళం పోరాటం చేస్తోంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారులకు కొన్ని ఫ్రీ సింబల్స్ ను పంపించారు. వాటిలో చపాతీ రోలర్, డోలి, కుట్టు మిషన్, సబ్బు డబ్బా, టీవీ, కెమెరా, పడవ, రోడ్డు రోలర్ వంటివి ఉన్నాయి. ఈ గుర్తులను జాబితా నుంచి తొలగించాలనేది బీఆర్ఎస్ డిమాండ్. అయినా కూడా వాటిని అలాగే ఉంచడం ఇప్పుడు ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి 1,079 ఓట్లతో ఓడిపోగా.. రోటీ మేకర్ గుర్తుతో పోటీచేసిన బండారు నాగరాజుకు 3,510 పోల్ అయ్యాయి. అలాగే, హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో రోటీ మేకర్ గుర్తుతో పోటీ చేసిన సుమన్ కు 2,697 ఓట్లు పడ్డాయి. మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన యుగతులసి అభ్యర్థి శివకుమార్ కు 1,880 ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ లో రోడ్డు రోలర్ గుర్తుకు 4,330 ఓట్లు, సిర్పూర్ లో 4,039, మునుగోడులో 3,569, డోర్నకల్ లో 4,117, హుజూరాబాద్ లో 2,660, భూపాలపల్లిలో చపాతీ మేకర్ గుర్తుకు 4,787 ఓట్లు, దేవరకొండలో రోడ్డు రోలర్ గుర్తుకు 3,247 ఓట్లు పడ్డాయి. అయితే.. వీటిలో అధిక శాతం ఓట్లు బీఆర్ఎస్ వే అనేది ఆపార్టీ నేతల వాదన. అందుకే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సానుకూల స్పందన రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.