Telugu News » KCR : కామారెడ్డి కష్టమేనా? ఆ సంఘాలతో చిక్కులు తప్పవా?

KCR : కామారెడ్డి కష్టమేనా? ఆ సంఘాలతో చిక్కులు తప్పవా?

టీడీపీకి చెందిన గంప గోవర్ధన్ బీఆర్ఎస్ లో చేరి 2012 ఎన్నికలో గెలిచారు. అప్పటి నుంచి ఆయనే వరుసగా గెలుస్తున్నారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. కాకపోతే.. స్థానికంగా ఉన్న సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

by admin
KCR who stood at the top in Janagraha

– కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు..
– అంత ఈజీ కాదా?
– పలు సంఘాల నుంచి..
– వ్యతిరేకత పెరుగుతోందా?
– కేసీఆర్ ఓటమే లక్ష్యంగా..
– పని చేస్తామని అంటున్నది ఎవరు?
– నిధుల వరద పారిస్తున్న సీఎం

టీడీపీ (TDP), కాంగ్రెస్ (Congress) కి చెందిన గజ్వేల్ (Gajwel) నియోజకవర్గాన్ని 2014 నుంచి కబ్జా చేసింది బీఆర్ఎస్ (BRS) పార్టీ. అక్కడి నుంచి కేసీఆర్ (KCR) పోటీకి దిగడంతో గతంలో గెలిచిన టీడీపీ, కాంగ్రెస్ ను జనాలు పట్టించుకోలేదు. రెండు పర్యాయాల నుంచి ఆయనే గెలిచారు. మరోమారు పోటీకి సై అంటున్నారు. కాకపోతే, గజ్వేల్ తో పాటు కామారెడ్డి (Kamareddy) లోనూ పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. గజ్వేల్ ఓటమిని ముందుగా గ్రహించే కేసీఆర్ సెకెండ్ ఆప్షన్ పెట్టుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈసారి రెండు చోట్లా ఆయన ఓడిపోతారని అంచనా వేస్తున్నాయి.

KCR who stood at the top in Janagraha

కామారెడ్డి నియోజకవర్గం కూడా గజ్వేల్ మాదిరిగానే ఉండేది. గెలిస్తే తెలుగుదేశం.. లేదంటే కాంగ్రెస్. అయితే.. టీడీపీకి చెందిన గంప గోవర్ధన్ బీఆర్ఎస్ లో చేరి 2012 ఎన్నికలో గెలిచారు. అప్పటి నుంచి ఆయనే వరుసగా గెలుస్తున్నారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. కాకపోతే.. స్థానికంగా ఉన్న సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కామారెడ్డిలో ముదిరాజులు ఎక్కువగా ఉన్నారు. అయితే.. కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో ఈ సామాజిక వర్గానికి చెందిన ఒక్క లీడర్ కూడా లేరు. దీంతో ముదిరాజులు ఆయనపై గుర్రుగా ఉన్నారు.

ఈమధ్య ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధర్మపోరాటం పేరుతో భారీ ర్యాలీ జరిగింది. ఇది కేసీఆర్ కు వ్యతిరేకంగానే జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమికి గట్టిగా పని చేయాలని ఈ సంఘం నేతలు పిలుపునిచ్చారు. తమ సామాజికవర్గం జనాభా ప్రాతిపదికగా కనీసం 4 టికెట్లు ఇవ్వాలని వీళ్ళు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. కానీ, కేసీఆర్ ఆ దిశగా ఆలోచించలేదు. దీంతో రగిలిపోతున్న ముదిరాజులు కామారెడ్డిలో ఆయన్ను ఓడించాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, గజ్వేల్ లోనూ ఈ సామాజిక వర్గానికి 20వేలకు పైనే ఓట్లు ఉన్నాయి. అక్కడ కూడా చిక్కులు తప్పవనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, కామారెడ్డి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో గల్ఫ్‌ దేశాలకు వలసవెళ్లారు. నాలుగైదు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రాంతం నుంచి వలస వెళ్తున్నారు. నియోజకవర్గానికి చెందిన 30 వేల మందికిపైగా ఎడారి దేశాలలో ఉన్నారని అంచనా. వీరికి సంబంధించిన కుటుంబసభ్యుల ఓట్లు భారీగానే ఉంటాయి. అలాగే, ఇక్కడ చాలామంది గల్ఫ్‌ బాధితులు ఉన్నారు. కొందరు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రమాదవశాత్తూ మరణించిన వారున్నారు. చాలా కుటుంబాలు రోడ్డుపడ్డాయి. అయితే.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలు గల్ఫ్ కార్మికుల కోసం పలు హామీలు ఇచ్చారు. రాష్ట్రమొచ్చి ఇన్నేళ్లయినా ఏ హామీ నెరవేర్చలేదని గల్ఫ్ జేఏసీ నేతలు చెబుతున్నారు. ఇటీవల గల్ఫ్ బాధితుల కుటుంబసభ్యులు కూడా భారీ ర్యాలీ తీశారు. ఈ క్రమంలోనే తమ డిమాండ్లను పరిష్కరించాలని.. లేకపోతే, ఎన్నికల్లో పోటీకి దిగుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా సంఘాలను శాంతింపజేస్తేనే కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని అంటున్నారు రాజకీయ పండితులు.

మరోవైపు, కేసీఆర్ నిధుల వరద పారిస్తున్నారు. గత 40 రోజుల వ్యవధిలో అభివృద్ధి పనులకు ఏకంగా రూ.280 కోట్ల ఫండ్స్ రిలీజ్​ చేశారు. భగీరథ పైప్ ​లైన్ ​కోసం అత్యధికంగా రూ.195 కోట్లు వినియోగిస్తుండగా, మిగిలిన నిధులతో రూ.45 కోట్లతో కామారెడ్డి టౌన్ ​లో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కులాలవారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ఊరూరా కమ్యూనిటీ భవనాలు, వివిధ వర్గాల ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు గుడులు, చర్చిలు, మసీదులకు ఇప్పటికే సుమారు రూ.50 కోట్ల దాకా విడుదల చేశారు. ఇంకా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలయ్యేలా చూస్తున్నారు.

You may also like

Leave a Comment