తెలంగాణ (Telangana) లో మరో ప్రముఖ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16,650 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ మెంట్ ఇది. ఈ భారీ పెట్టుబడి పెడుతోంది అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్(ఎక్స్)లో వెల్లడించారు.
హైదరాబాద్ (Hyderabad) లో గ్రీన్ ఫీల్డ్ ఆర్ అండ్ డీ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి. ఇది ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ వృద్ధికి సంకేమని తెలిపారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని వెల్లడించారు.
కంపెనీ ఎండీ పంకజ్ పట్వారీ, సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన ఫోటోలను పోస్ట్ చేశారు కేటీఆర్. రాష్ట్రంలో సంస్థ విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలను వారు కేటీఆర్ కు వివరించారు. ఈ ఒప్పందం ఫార్మాస్యూటికల్ రంగంలో హైదరాబాద్ ప్రాముఖ్యతను వివరిస్తోందని తెలిపారు.
ఇక, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ లో కిటెక్స్, చందనవెల్లిలో వెల్ స్పన్ ఏర్పాటు చేస్తున్న సింటెక్స్ యూనిట్ లకు మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వరదలా వస్తున్నాయని చెప్పారు.