– బీఆర్ఎస్ లో ఎన్నికల కోలాహలం
– కాంగ్రెస్ లో చేరికల సందడి
– మరి, బీజేపీ సంగతేంటి..?
– ప్రకటనలకే పరిమితం అవుతోందా?
– అధ్యక్ష మార్పుతో లాభం జరిగిందా?
– రానున్న రోజుల్లో సీనియర్ల స్ట్రోక్ తప్పదా?
– క్యాడర్ లో గందరగోళం..
– జాతీయవాద అంశాలకు దూరమవ్వడమే కారణమా?
ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాన పార్టీల్లో ఎంతటి కోలాహలం ఉంటుందో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) లో ప్రస్తుతం అదే నెలకొంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాలు అంటూ జనంలో ఉంటోంది బీఆర్ఎస్. ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ వాటి ప్రచారంలో బిజీగా ఉంది. అలాగే, ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. మరి, బీజేపీ (BJP) సంగతేంటి..? ఇదే విషయాన్ని రాజకీయ పండితులను అడిగితే.. స్వీయ తప్పిదమేననే మాట వారి నుంచి వినిపిస్తోంది.
అధ్యక్ష మార్పుతో కన్ఫ్యూజన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాన్నాళ్లూ పార్టీ క్యాడర్ లో ఏదో ఉత్సాహం కనిపించింది. ఎన్నికలకు ముందు వ్యూహాత్మకమని బండిని తొలగించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఇది పార్టీ క్యాడర్ ను కన్ఫ్యూజన్ కు గురి చేసిందనేది విశ్లేషకుల వాదన. ఫుల్ స్పీడ్ లో వెళ్తున్న వాహనాన్ని సడెన్ యూటర్న్ తిప్పితే ఎలా ఉంటుందో అధిష్టానం అలాంటి నిర్ణయమే తీసుకుని రేసులో వెనుకబడిందని అంటున్నారు. అప్పటిదాకా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలా సాగిన యుద్ధం.. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లా కొనసాగుతోందని పలు అంశాలను ఉదహరిస్తున్నారు.
జాతీయవాదం.. మాటేంటి?
అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం బీజేపీ జాతీయవాద అంశాలపై దృష్టి పెట్టిందని మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. జాతీయవాద అంశాలను ప్రజల్లోకి.. మరీముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకునే విధంగా ప్రస్తావిస్తూనే స్థానిక సమస్యలను కూడా లేవనెత్తాలని నిర్ణయించింది. జాతీయవాద అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని భావించింది. కానీ, అనుకన్నదొక్కటి జరుగుతున్నదొక్కటి తీరుగా సీన్ మారిందని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు. తెలంగాణలో బీజేపీకి, హిందుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఘోరాలు జరిగాయని.. వాటిని తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమైందని అంటున్నారు. ఉత్తరాదిన ఇలాంటి అంశాలనే తమకు అనుకూలంగా మలుచుకుని పలు రాష్ట్రాలను గెలుచుకున్న పార్టీ.. తెలంగాణలో మాత్రం మెతక వైఖరి అవలంభిస్తోందని విశ్లేషిస్తున్నారు.
మోడీని తిడుతున్నా.. అవినీతి జరిగినా.. అంతేనా?
బీజేపీకి ప్రధాని మోడీ ఒక బ్రాండ్ లా మారిపోయారు. భారత్ ను విశ్వగురువుగా నిలిపేందుకు ఆయన ఎంతో శ్రమిస్తున్నారని కమలనాథులు తరచూ చెబుతుంటారు. అలాంటి నాయకుడ్ని బీఆర్ఎస్ నేతలు నానా మాటలు అంటుంటారు. ప్రపంచ దేశాధినేతలు, ప్రజలు మెచ్చుకునే మోడీని గులాబీ నేతలు ఓ గల్లీ లీడర్ లా తీసేసి మాట్లాడుతుంటారు. అయినా కూడా బీజేపీ మాటలకే పరిమితం అవుతుందే గానీ, తర్వాతి చర్యలకు ఉపక్రమించడం లేదనేది విశ్లేషకుల మాట. రాష్ట్రానికొచ్చే నేతలు, అంత అవినీతి జరిగింది.. ఇంత దోచేశారు అని చెప్పడమేగానీ.. ఈ అంశాల్లో ముందుకు వెళ్లింది లేదని.. దీని ద్వారా రాంగ్ మెసేజ్ వెళ్లి బీజేపీ గ్రాఫ్ డ్యామేజ్ అయిందని విశ్లేషిస్తున్నారు.
సీనియర్ల స్ట్రోక్.. ఏ క్షణమైనా?
బీఆర్ఎస్ ఓటమే లక్ష్యమంటూ చాలామంది నేతలు బీజేపీలో చేరారు. ఆ సమయానికి కాంగ్రెస్ ను కేసీఆర్ నిర్వీర్యం చేయడంతో వాళ్లంతా బీజేపీ బాట పట్టారు. అయితే.. పార్టీ విధానాలు, తెలంగాణలో అనుసరిస్తున్న మెతక వైఖరికి కొందరికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ క్రమంలోనే వరుసగా భేటీలు జరుగుతున్నాయి. కొందరు సీనియర్లు.. ఏ క్షణమైనా గుడ్ బై చెప్పేందుకు ప్రిపరేషన్ లో ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. ఈమధ్య రాజగోపాల్ రెడ్డి అయితే.. కేసీఆర్ ఓడించే ఏ అవకాశాన్నీ వదులుకోమని.. చివరకు కాంగ్రెస్ లో చేరేందుకు కూడా సిద్ధమని మాట్లాడినట్లు వార్తలొచ్చాయి. ఈ సీనియర్ల గ్రూప్ కేసీఆర్ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న సున్నిత రాజకీయంపై అసంతృప్తిలో ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తేనే.. అనుకున్న లక్ష్యాలు చేరే అవకాశం ఉందని సూచిస్తున్నారు విశ్లేషకులు.