ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గతంలో సంచలనం రేపింది. బీజేపీ (BJP) తమ ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ (BRS) లీడర్లు తెగ గగ్గోలు పెట్టారు. దీనిపై ప్రత్యేక సిట్ వేసి విచారణ జరిపించింది తెలంగాణ ప్రభుత్వం. బీజేపీ నేత బీఎల్ సంతోష్ (BL Santosh) సహా పలువురికి నోటీసులు పంపించింది. అయితే.. వారు హైకోర్టుకు వెళ్లడం.. స్టే తెచ్చుకోవడంతో.. కొన్నాళ్లకు ఈ కేసు సైలెంట్ అయిపోయింది. అయితే.. ఈ కేసు గురించి తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ పెట్టిన రేవంత్ (Revanth).. తెలంగాణ సీఎంవో ను ట్యాగ్ చేస్తూ కేసీఆర్ ను ప్రశ్నించారు. ‘‘మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా? ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం’’ అంటూ సెటైర్లు వేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ పై అనేక ఆరోపణలు అయితే వచ్చాయి. కానీ, కోర్టు ఆదేశాలు, ఇతర అంశాల నేపథ్యంలో సిట్ ముందుకు వెళ్లలేకపోయింది. ఈ కేసు గురించి చాలావరకు మర్చిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని గుర్తు చేయడంతో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. వాటిలో పాల్గొనేందుకు నగరానికి వచ్చారు బీఎల్ సంతోష్. ఈ నేపథ్యంలో రేవంత్ ఇలా రియాక్ట్ అయ్యారు.