దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Election) జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ ఎన్నికలపై ఎన్నో వార్తలు కునుకు పట్టకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే గుండెల్లో గునపాలు దిగినంత ఫీలింగ్ కలుగుతోంది. ఇప్పటికే కొన్ని పార్టీలు రంగంలోకి దిగి ప్రచారాల పర్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల (5 States) ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో తెరపైకి వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. అక్టోబర్ (October) 8 నుంచి 10 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకొంది.
డిసెంబర్ (December) రెండో వారంలో ఓట్ల లెక్కింపు జరిగే అవకాశాలున్నాయని, తెలంగాణ (Telangana), రాజస్థాన్ (Rajasthan), మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడత ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉండగా, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం అయిదు రాష్ట్రాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరిపింది. ఇకపోతే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ద్విముఖ పోరు నెలకొనగా, తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. మరీ ఓటర్లు ఈ సారి ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగవలసిందే..