క్రికెట్.. కొందరికి అదే ప్రపంచం. మరికొందరికి ప్రాణం. అందులో వరల్డ్ కప్ (World Cup) అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఎందరో అభిమానుల హృదయాలను శాసిస్తున్న వరల్డ్ కప్ 2023 టోర్నీఅక్టోబర్ 5 నుండి మొదలైన విషయం తెలిసిందే. కాగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England), న్యూజిలాండ్ (Newzealand), సమరానికి దిగగా.. ఈ పోరులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర (Rachin Ravindra) 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో ఒక్కసారిగా అతని పేరు మారుమ్రోగిపోయింది. ఈ నేపథ్యంలో అసలు రచిన్ రవీంద్ర ఎవరూ? అతనికి భారత్‌తో ఉన్న సంబంధం ఏంటనే రహస్యాన్ని తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
రచిన్ రవీంద్ర గురించి తెలుసుకొంటే.. భారత సంతతికి చెందిన రవీంద్ర.. న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌తోనే ఆరంగేట్రం చేసిన రచిన్ ఇప్పటి వరకు 18 టీ 20లు, 13 వన్డే మ్యాచ్‌లు ఆడటమే కాకుండా.. బౌలింగ్ చేసి 26 వికెట్స్ కూడా తీసాడు. ఒక అర్ధ సెంచరీ చేశాడు.
ఇక 23 ఏళ్ల రచిన్ రవీంద్ర విషయానికి వస్తే ఆయన తల్లిదండ్రులు అందరు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990లో న్యూజిలాండ్ వెళ్లి అక్కడే సెటిల్ కాగా, మనోడు క్రికెట్ ఓనమాలు నేర్చుకుంది మాత్రం ఇండియాలోనే. ప్రతీ ఏడాది ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఉన్న ఆర్డీటీకి వచ్చి క్రికెట్ ఆడతుంటాడు రచిన్. మొత్తానికి రవీంద్ర కు అనంతపురంతో ఉన్న లింకు ఇదన్న మాట. ఇంకేముంది ఈ కుర్రాడు మనోడే అని అసలు విషయం తెలుసుకొన్న క్రికెట్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.