ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) ప్రకటించిన అనంతరం మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తేదీలు తమ పార్టీకి మంచిగ కుదిరినట్టు చెప్పారు. ఈ సారి తమకు అన్నీ కలిసి వచ్చేలా కనిపిస్తోందని అన్నారు. ఈ సారి సీఎం కేసీఆర్ (CM KCR) హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనిపిస్తోందని వెల్లడించారు.
పరకాల నియోజకవర్గంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారని, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారని తెలిపారు. 30,03, మూడోసారి కేసీఆర్ సీఎం అవ్వడం పక్కా అని పిస్తోందన్నారు. ఈ సారి లెక్కలు కూడా తమకు బాగా కుదిరినట్టు చెప్పారు. తమకు అన్నీ కలిసి వస్తున్నాయన్నారు.
మూడు, మూడు ఆరు అని అన్నారు. తమ లక్కీ నంబర్ కూడా ఆరు అని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే మూడోసారి కేసీఆర్ సీఎం అవ్వడం పక్కానే అన్నట్టు కనిపిస్తోందన్నారు. ఎన్నికలు వస్తున్నాయని, ఇక ఇప్పుడు సంక్రాంతికి గంగి రెద్దుల వాళ్లు వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్లు వస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చిన కథలన్నీ చెబుతారని తెలిపారు.
ప్రజలు ఆగం కావద్దన్నారు. 2014కు ముందు మన పరిస్థితి ఏంది.. ఇప్పుడు పరిస్థితి ఎలా వుందో ఆలోచించాలన్నారు. వాటిని నమ్మి మోస పోకుండా ప్రజలంతా విచక్షణతో, ఆలోచనతో చైతన్యాన్ని ప్రదర్శించి ఓటు వేయాలని సూచించారు. విద్యుత్, తాగు నీరు, వ్యవసాయం, సాగునీరు గురించి ఆలోచించాలని ప్రజలకు ఆయన సూచించారు. తాము చెప్పింది వాస్తవమైతే ధర్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మనం కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితిని చూశామని తెలిపారు. ఆరు గంటల కరెంట్ కూడా మూడుసార్లు ఇచ్చేవారని చెప్పారు. దీంతో అప్పట్లో వ్యవసాయం కూడా పూర్తిగా ఆగమైందన్నారు. పరిశ్రమలు నడుపుదామంటే కూడా కరెంట్ లేని పరిస్థితి వుండేదన్నారు. 60 ఏండ్లలో కరెంట్ ఇవ్వని కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి అన్ని పనులు చేస్తామంటే నమ్ముదామా అని ప్రశ్నించారు.