తెలంగాణ (Telangana) లో ఎన్నికల సందడి మొదలైంది. ఎలక్షన్ కోడ్ (Election Code) అమల్లోకి రావడంతో పోలీసులు (Police) అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు దాచిన వస్తువులు, నగదు పట్టుబడుతున్నాయి. అలాగే, బ్యానర్లు, కటౌట్లను తొలగిస్తున్నారు. ఎక్కడా రాజకీయ సంబంధమైన రాతలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లోని పొలిటికల్ లీడర్ల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను బల్దియా సిబ్బంది తొలగించారు. పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వెహికల్ చెకింగ్ చేపట్టారు. గ్రేటర్ సిటీలోని పలు ఏరియాలలో తనిఖీలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న రూ.3.25 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం, షాద్ నగర్ లో భారీగా డబ్బు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ నిజాం కాలేజీ వద్ద జరిగిన సోదాల్లో ఏకంగా 7 కిలోల బంగారం, 300 కేజీల వెండి సీజ్ చేశారు.
బేగంబజార్ లో రూ.3 లక్షలు, చైతన్య పురిలో రూ.30 లక్షలు పట్టుకున్నారు పోలీసులు. షాద్ నగర్ లో ఉన్న టోల్ ప్లాజాలో రూ.18 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలో రూ.4 లక్షలు, జూబ్లీ హిల్స్ లో రూ.50 లక్షలు గుర్తించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లితండాలో వంటకు వినియోగించే కుక్కర్లను పోలీసులు పట్టుకున్నారు. ఇవి శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత మారబోయిన రఘునాథ్ యాదవ్ పేరుతో సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 90 కుక్కర్లను పట్టుకున్నారు. ఇక, ఫిలింనగర్ లో మద్యం సీసాలను పట్టుకున్నారు.
రాష్ట్రంలో నగదు లావాదేవీలు, మద్యం సరఫరాపై పూర్తి నిఘా పెట్టారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఎంజీఎం కూడలితోపాటు రుద్రమదేవి కూడలి వెంకటరమణ జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా.. రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.