తెలంగాణ (Telangana) లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. షెడ్యూల్ కూడా ప్రకటించడంతో పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో హైకోర్టు (High court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి (Singareni) ఎలక్షన్ ను వాయిదా వేసింది. ఈనెల 28న జరగాల్సిన ఎన్నికలను డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.
నవంబర్ 30వ తేదీ లోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు.. సింగరేణి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని స్పష్టం చేసింది. ఎన్నికలకు సహకరిస్తామని రేపటిలోగా హామీ పత్రం కూడా ఇవ్వాలని ఆదేశించింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నిక వాయిదా వేయాలంటూ 13 కార్మిక సంఘాలు, యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించాయి. దాదాపు ఆరు జిల్లాల పరిధిలోని 43 వేల మంది కార్మికులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమారు 700 మంది ఎలక్షన్ డ్యూటీలో ఉంటాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా ప్రభుత్వ సిబ్బంది ఆ డ్యూటీల్లో బిజీగా ఉన్నందున సింగరేణి ఎన్నికలను నిర్వహించడం ఇబ్బందికరమేనని హైకోర్టుకు తెలిపింది.
ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ నేతృత్వలోని ధర్మాసనం డిసెంబరు 27న పోలింగ్ నిర్వహించాలని, ఇందుకోసం ఓటర్ల జాబితాను రెడీ చేయాలని స్పష్టం చేసింది.