తెలంగాణ (Telanaga) లో ఎన్నికల గోల మొదలైంది. ఎవరికి వారే మోనార్క్ లా మారి దుమ్మెత్తి పోసుకొంటున్నారు. అధికార, ప్రతి పక్ష నేతలకు ఈ నాలుగు సంవత్సరాలుగా గుర్తుకు రాని ప్రజల కష్టాలు ఎన్నికల సమయంలో గుర్తుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఇవేమీ పట్టని నేతలు ఎన్నికల సమయంలో తూటాల పేలుతున్నారు. కాగా సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) కూడా పలు సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
తాజాగా బీజేపీ (BJP) పై నిప్పులు చెరిగారు నారాయణ. మోడీ (Modi) ప్రభుత్వం ఆదానీ కోసం అనేక మందిపై ఐటి, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులను, కూతురును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని.. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేదే బీజేపీ పెద్దలని ఆరోపించారు. తెలంగాణలో మొన్న ప్రధాని మోడీ, నిన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా (Amith Shaa) మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రాజీ ఒప్పందం కుదిరినాకే వైసీపీ, కేసీఆర్, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. అందరూ కలిసి కుమ్మకై సిసోడియాను మాత్రమే ఇరికించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్దతి కాదని, ఓటమి దగ్గర పడటంతోనే బీజేపీ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నారని నారాయణ అన్నారు.