ఈసారి బీజేపీ (BJP) గెలుపు ఖాయమని ఆపార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అభ్యర్థులే లేరంటూ బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) విమర్శలు చేస్తున్నా.. సైలెంట్ ఓటింగ్ జరగబోతోందని.. ఆ రెండు పార్టీలకు జనం బుద్ధి చెప్పడం ఖాయమని చెబుతున్నారు. ఓవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుగుతుండగా.. ఇంకోవైపు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ బీజేపీ కార్యాలయంలో యువమోర్చా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరగనుంది. దీనికి బీజేవైఎం (BJYM) జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య హాజరుకానున్నారు.
ఈ సమావేశానికి యువమోర్చా జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జ్ లు, సోషల్ మీడియా కన్వీనర్లు, యువమోర్చా కార్యకర్తలు హాజరుకానున్నారు. టికెట్ల కేటాయింపులో యువమోర్చాకు ప్రాధాన్యత ఇవ్వాలని నేతలు అంటున్నారు. కనీసం పది టికెట్లు కోరుతున్నారు. తేజస్వీ సూర్య ముందు ఈ ప్రతిపాదన పెట్టనును పెట్టనున్నారు యువమోర్చా నేతలు.
మరోవైపు, పార్టీలో చేరికల సందడి కొనసాగుతోంది. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే ఈయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అలాగే, రామగుండం నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. డీకే అరుణ, లక్ష్మణ్ లను కలిసిన సంధ్యారాణి.. చేరికపై చర్చలు జరిపారు.
రెండు మూడు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల కానుంది. అధిష్టానం పిలుపుతో నిన్న హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు కిషన్ రెడ్డి. ఈ నెల 15 లేదా 16న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థుల లిస్టుపై అధిష్టానంతో కిషన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. సుమారు 40 మందితో ఫస్ట్ లిస్ట్ వెలువడుతుందని అంటున్నారు.