తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) చాలా రోజులుగా ప్రగతి భవన్ (Pragathi Bhavan) కే పరిమితం అయ్యారు. ముందు వైరల్ ఫీవర్ బారిన పడిన ఆయన తర్వాత ఛాతిలో ఇన్ ఫెక్షన్ తో బాధపడ్డారు. బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కావడంతో కోలుకోవడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ (KTR) ఆమధ్య ప్రకటించారు. పత్యేక వైద్యుల బృందం సీఎం కు చికిత్స అందిస్తూ వస్తోంది. అయితే.. ఆయన కోలుకున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తొలిసారి ప్రగతి భవన్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు (Harish Rao) లతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. అలాగే, అధికారుల బదిలీ విషయంలో ఈసీ నిర్ణయంపై సమాలోచన చేశారు. పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. మిగిలిన సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీకొచ్చిన బీఆర్ఎస్ బాస్.. రెండో జాబితాను కూడా విడుదల చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారని ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఓ క్లారిటీ ఇవ్వగా… మిగిలిన స్థానాలైన నర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డి, నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్, గోషామహల్ నుంచి గోవింద్ రాటే, మల్కాజిగిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డిల పేర్లను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
ఇక, కేసీఆర్ ఎలక్షన్ క్యాంపెయిన్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. 15 నుంచి ఆయన రంగంలోకి దిగుతున్నారు. అదే రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచి వరుసగా జిల్లాల బాట పట్టనున్నారు కేసీఆర్. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.