అంతరిక్ష రంగం (Space Sector)లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) అద్బుతమైన విజయాలను సాధిస్తోంది. ప్రపంచ దేశాలకు సాధ్యం కానీ ప్రయోగాలను అతి తక్కువ ఖర్చుతో చేసి చూపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇస్రో వైపే చూస్తోంది. ఇస్రో భవిష్యత్ ప్రయోగాల గురించి అత్యంత ఆసక్తితో చూస్తున్నాయి.
అలాంటి గొప్ప పేరు ఉన్న ఇస్రోలో చేరేందుకు ఐఐటీయన్స్ ముందుకు రావడం లేదని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్ అన్నారు. ఇస్రోలో చేరేందుకు ఐఐటీయన్స్ ఆలోచిస్తుంటారని అన్నారు. గతంలో ఐఐటీలో రిక్రూట్‌మెంట్ సెషన్‌లో జరిగిన ఘటనను ఆయన తాజాగా గుర్తు చేశారు. రిక్రూట్ మెంట్ సమయంలో చాలా మంది ఇస్రోలో గరిష్ట జీతం ఎంత అని తెలుసుకుని వెనుదిరిగారని చెప్పారు.
అంతరిక్షాన్ని ఒక ఆవశ్యక రంగంగా అతి కొద్ది మంది మాత్రమే భావిస్తున్నారని తెలిపారు. అందులో కేవలం 1శాతం వ్యక్తులు మాత్రమే ఇస్రోలో చేరేందుకు నిర్ణయించుకుంటున్నారని అన్నారు. ఇస్రోకు ఉన్న అద్భుతమైన చరిత్ర, సాధించిన చారిత్రాత్మక విజయాలు సాధించిన ఘనత ఉన్నప్పటికీ చాలా మంది ప్రతిభావంతులైన నిపుణులు ప్రత్యామ్నాయ వృత్తి మార్గాలను ఎంచుకునేందుకే ఇష్టపడుతున్నారని చెప్పారు.
ఇది ప్రతిభ అంతరానికి దోహదం చేస్తుందని వివరించారు. ఇలాంటి ఆందోళనలు ఇప్పుడే కొత్తదేం కాదన్నారు. కానీ ఈ మధ్య ఇస్రో ఉద్యోగుల జీతాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఓ ట్వీట్ చేయగా వైరల్ అయిందన్నారు. ఇస్రో ఛైర్మన్ హోదాలో డా. ఎస్. సోమనాథ్ నెల వేతనం కేవలం రూ. 2.5 లక్షలేనని ట్వీట్ చేశారు. ఆ వేతనం న్యాయమైదేనా? అని ప్రశ్నించారని వెల్లడించారు. వేతనం కన్నా సైన్స్ అండ్ రీసెర్చ్ రంగంలో ఆయనకు ఉండే ఆసక్తిని, తపనను గుర్తించాలని సూచించారు..