టీ కాంగ్రెస్ (T Congress) కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. ఆయన జనగామ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనను కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వనున్నారనే సమాచారం మేరకు ఆయన పార్టీని వీడితున్నట్టు తెలుస్తోంది.
పార్టీ సిద్ధాంతాలను నమ్మి తాను పార్టీలో చేరానని చెప్పారు. పార్టీ కోసం నాలుగు దశాబ్దాలుగా అంకిత భావంతో పని చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశానని అన్నారు. అంతే కాకుండా 12 ఏండ్ల పాటు మంత్రిగా పని చేశానని వెల్లడించారు. అలాంటి తనకు పార్టీలో తీవ్ర అవమానం జరిగిందని ఆయన వాపోయారు.
జనాభా లెక్కల ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయించాలని గత కొంతకాలంగా తాను హైకమాండ్ ను రిక్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయంలో తన మాటను పార్టీ లెక్కలోకి తీసుకోలేదన్నారు. పది రోజుల క్రితం ఢిల్లీకి వచ్చానని తెలిపారు. ఆ సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేశానని వివరించారు.
కానీ తనకు కనీసం ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సీనియర్ నాయకుడిగా వున్న తనకే ఇలా జరిగితే ఇక కొత్తగా పార్టీలో చేరుతున్న లీడర్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. జనగామ నియోజకవర్గంపై తనకు పూర్తిస్థాయిలో పట్టు ఉందని చెప్పారు. కానీ కొందరు వ్యక్తులు రాజకీయాలు చేసి తనకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారని అన్నారు.