ప్రవళ్లిక మరణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) స్పందించారు. ట్విట్టర్ (ఎక్స్)లో దీనిపై మాట్లాడిన ఆయన.. తెలంగాణ (Telangana) నిరుద్యోగులకు కీలక హామీ ప్రకటించారు. హైదరాబాద్ (Hyderabad) లో నిరుద్యోగ యువతి ఆత్మహత్య అత్యంత బాధాకరమన్నారు రాహుల్. ఇది ఆత్మహత్యగా చూడవద్దని.. నిరుద్యోగ యువత కలలు, ఆశలను ప్రభుత్వం హత్య చేసినట్టుగా ఉందని పేర్కొన్నారు.
త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రాబోతోందని… నిరుద్యోగ యువత ఆశలను నిలబెడుతుందన్నారు రాహుల్ గాంధీ. నెల రోజుల్లో యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ (TSPSC) ని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇది తమ గ్యారెంటీ అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ యువత ఉద్యోగాలు లేక విలవిలలాడుతోందన్నారు.
యువత కలలు, ఆశలను ప్రభుత్వం కూల్చేస్తోందని.. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) కలిసి తమ అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆరోపించారు రాహుల్. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగాల క్యాలెండర్ ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదని విమర్శించారు. ప్రవళ్లిక ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించాలని.. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
శుక్రవారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ లో ప్రవళ్లిక అనే గ్రూప్ -2 అభ్యర్థి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ లో ఉరి వేసుకుని చనిపోయింది. ఈ ఘటనతో విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు రగిలిపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు.