ప్రజలకు నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరిస్తోందని టీజేఎస్ (TJS) అధినేత కోదండరాం (Kodanda Ram) మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ (TSPSC) ని రద్దు చేయాలని సడక్ బంద్ కు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోదండరాం సహా ఇతర నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు కోదండరాం. వరుసగా పరీక్షల్లో వైఫల్యం చెందిన టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి, కమిటీ సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. నూతన బోర్డును ఏర్పాటు చేయాలని.. డీఎస్సీ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలన్నారు.
పరీక్షల రద్దు వల్ల ఎంతోమంది నిరుద్యోగ విద్యార్థులు నష్టపోయారని, వారందరికీ పరిహారంగా 3 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్ చేశారు. నిరుద్యోగులను ప్రభుత్వం అభద్రతా భావంలోకి నెట్టేసిందని, వారికి న్యాయం చేయాలని చెప్పి తాము బయలుదేరితే ఆపేశారని మండిపడ్డారు. వెంటనే విద్యార్థులు, నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రవళ్లిక ఆత్మహత్య నిరుద్యోగుల సమస్యకు అద్దం పడుతోందన్నారు కోదండరాం. ఆమె ప్రభుత్వ నౌకరీ కోసం ప్రయత్నిస్తోందని, ఆ పరీక్షలు వాయిదా పడడంతో ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. ఇప్పటికే 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో కొందరు నిరుద్యోగమే ప్రధాన అంశం అని సూసైడ్ నోట్ రాశారని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు.
ఖమ్మంలో అఖిలపక్ష నేతలు రోడ్డెక్కారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని.. నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాపర్తి నగర్ బైసాస్ పై ధర్నా చేపట్టడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. తర్వాత నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.