టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టు, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ (Hyderabad) లో లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్ల టీ షర్ట్ లను ధరించి.. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ప్రయాణం చేసి నిరసన తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులతోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. బీజేపీ (BJP) శేరిలింగంపల్లి నాయకులు గజ్జల యోగానంద్ (Gajjala Yoganand) పాల్గొని.. చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఆయనకు మద్దతుగా మెట్రో (Metro) ప్రయాణం చేశారు.
ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు బాధాకరమన్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా, కక్ష పూరితంగా ఆయన్ను అరెస్టు చేశారని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. విజన్-2020 లో భాగంగా ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. అయితే.. చంద్రబాబు చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్ వాళ్లు తామే చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు.
సుపరిపాలనను రాజకీయాలకు అతీతంగా అభినందించాలని తెలిపారు యోగానంద్. మెట్రో రైలులో చంద్రబాబుకి సంఘీభావం తెలపడం తన వ్యక్తిగతమని.. ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా కేవలం నగర అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎంత ఉందని తెలియజేయడమే తన ఉద్దేశమని అన్నారు.
తనకు న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందని.. చంద్రబాబుకు తప్పకుండా న్యాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు యోగానంద్. ఈ కార్యక్రమంలో చంద్రబాబు అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.