మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ (Former CEC) మనోహర్ సింగ్ గిల్ (MS Gil)కన్ను మూశారు (Passed away). దక్షిణ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆయనకు భార్య ముగ్గరు కూతుళ్లు ఉన్నారు.
1996 నుంచి 2001 మధ్య ఆయన భారత ఎన్నికల ప్రధాన అధికారిగా పని చేశారు. టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్న సమయంలో గిల్, జీవీజి కృష్ణమూర్తిలను ఎన్నికల కమిషనర్లుగా నియమించారు. అప్పటి నుంచి ఎన్నికల కమిషన్ బహుసభ్యుల కమిటీగా మారింది. ఆ తర్వాత ఎంఎస్ గిల్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాంగ్రెస్ తరఫున మొదట ఆయన రాజ్యసభ ఎంపీగా నామినెట్ అయ్యారు.
ఆ తర్వాత 2008లో కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. ఎంఎస్ గిల్ మృతిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం ఎంఎస్ గిల్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. గిల్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ఖర్గే ఎక్స్ లో (గతంలో ట్విట్టర్) లో వెల్లడించారు.
మరోవైపు గిల్ మరణంపై పంజామ్ మాజీ ముఖ్యమంత్రి అమరీంద్ సింగ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గిల్ మరణ వార్త విని తాను తీవ్ర ఆవేదన చెందానన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. గిల్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.