ఏపీ (AP) హై కోర్టు (High Court)లో నేడు కీలక పిటిషన్ పై విచారణ జరగనుంది. రాజధాని పేరుతో భూముల అవకతవకలకు పాల్పడ్డారని దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరుపనుంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి నారాయణ (Narayana) అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ (CID) కేసు నమోదు చేయగా ఇదే కేసులో ఇప్పటికే విచారణ జరిపిన హై కోర్టు నేడు మరోసారి విచారించనుంది.
రాజధాని కోసం అసైన్డ్ భూములు సేకరించడంలో అవకతలకు పాల్పడ్డారని కేసు నమోదు కాగా విచారించిన సీఐడీ, నారాయణ, చంద్రబాబు పాత్ర ఉందని హైకోర్టులో వాదనలు వినిపించింది. కాగా అసైన్డ్ భూములకు సంబంధించి చంద్రబాబు, నారాయణలపై 2021లో కేసు నమోదు చేయగా ఈ కేసును సుధీర్ఘంగా విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది..
మరోవైపు అసైన్డ్ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో నారాయణ, చంద్రబాబు పిటిషన్ల వేయగా వాటి పైన విచారించిన హైకోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. అయితే అసైన్డ్ భూముల సేకరణలో అక్రమాలు జరిగాయని అందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు ఉన్నాయంటూ కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగురు ప్రియ ఇచ్చినా ఆధారాల మేరకు వాటిని సీఐడీ అధికారులు కోర్టులో సమర్పించారు. అయితే ఈ రెండు పిటిషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసు పై విచారణ ముగిసింది కాబట్టి హై కోర్టు కేసును రీ ఓపెన్ చేస్తుందా? లేక ఇదే కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టి మళ్లీ కేసును విచారిస్తుందా? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది..