బీఆర్ఎస్ (BRS) పార్టీ విడుదల చేసిన మెనిఫెస్టో పై విమర్శల ప్రవాహం కొనసాగుతోన్న నేపధ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మెనిఫెస్టో చూసిన తర్వాత కాంగ్రెస్, (Congress) బీజేపీ (BJP) పార్టీల్లో గుబులు మొదలైందని, అందుకే ఆ రెండు పార్టీల నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.
తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా పార్టీ మెనిఫెస్టో ఉందని తెలిపారు. తాడూ బొంగరం లేని కాంగ్రెస్ చెప్పే మాటలు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ముందుగా కాంగ్రెస్ జాతీయ నాయకులు ఏమి తెలియని స్థానిక నేతలు రాసిచ్చే స్క్రిప్ట్ ను చదవడం మానుకోవాలని సూచించారు. మరోవైపు అబద్ధాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని, రూ. 15 లక్షలు ఒక్కో ఖాతాలో వేస్తామని చెప్పి విస్మరించారని, ఏటా 2 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని కవిత విమర్శించారు.
తెలంగాణ ప్రజల కోసం సీఎం కేసీఆర్ మంచి మెనిఫెస్టోను విడుదల చేశారని ప్రశంసించారు. 2014లో రూ. లక్షా 12 వేలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 3 లక్షల 15 వేలకు చేరిందంటే తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుందన్నారు. కాగా బీఆర్ఎస్ నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత కిషన్ రెడ్డి మరికొందరు నేతలు స్పందించారు. వారి వ్యాఖ్యలకు కవిత ధీటుగా కౌంటర్ ఇచ్చారు.