తెలంగాణలో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తోంది బీజేపీ. ఓవైపు అగ్ర నేతలను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజలకు ఓ భరోసానిస్తోంది. ఇంకోవైపు ప్రజా సమస్యలపై అవగాహన, అనుభవం కలిగిన బలమైన నేతలను అభ్యర్థులుగా బరిలోకి దింపాలని చూస్తోంది. అలాంటి నాయకుల్లో ఒకరే శేరిలింగంపల్లి లీడర్ గజ్జల యోగానంద్. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం కష్టపడుతున్న ఈయన.. అటు సేవా కార్యక్రమాలతోనూ, ఇటు ప్రజా సమస్యలపై పోరాటంలోనూ జనం మనిషిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ‘రాష్ట్ర’ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాల గురించి మాట్లాడారు.
విద్యార్థి నాయకునిగా ప్రస్థానం
ప్రశ్నించే తత్వం విద్యార్థి దశలోనే అలవడుతుంది. సమాజంపై అవగాహన ఏర్పడి సమస్యల పరిష్కారానికి ముందుకు కదిలేలా చేస్తుంది. అలా తన విద్యార్థి దశలో ఎన్నో పోరాటాలు చేశారు యోగానంద్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యునిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఓయూ స్వయం ప్రతిపత్తిని పునరుద్దించడానికి చేసిన పోరాటంలో.. వర్సిటీ భూములను అసాంఘిక వ్యక్తుల ఆక్రమణ నుండి కాపాడడంలో కీలక భూమిక పోషించారు. విద్యార్థుల తరఫున పోరాటాలు సాగించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితులై జాతి నిర్మాణానికి శిక్షణ పొందారు.
వ్యాపారవేత్తగా ఎందరికో ఆదర్శం
విద్యార్థి దశలోనే సాధించిన నాయకత్వ దక్షతకు తోడు సివిల్ ఇంజనీరింగ్ లో సాధించిన నైపుణ్యంతో రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఒరవడులు సృష్టించారు యోగానంద్. పట్టణీకరణ, నిర్మాణ రంగాల్లో అభివృద్ధిని ముందే గ్రహించి ఆయా రంగాల్లో ఓ బ్రాండ్ ను ఏర్పాటు చేసుకున్నారు. పట్టణాలలో పేద, మధ్యతరగతి వారికి అనువైన ధరలలో.. సొంతింటి కల సాకారం కోసం ఎన్నో నిర్మాణాలు చేశారు. ఈ రంగంలో యోగానంద్ చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ, పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ సలహాదారుడుగా నియమించుకుంది. అంతేకాదు, ప్రతిష్టాత్మక సంస్థల్లో పలు హోదాల్లో ఉంటూ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.
బీజేపీలో క్రియాశీలక పాత్ర
జాతి నిర్మాణం అంటే భౌతిక సదుపాయాలు మాత్రమే కాదని.. విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి కీలక అంశాలలో ప్రజల జీవన శైలిని మెరుగుపరిచేందుకు భారతీయ జనతా పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రజలకు దగ్గరయ్యారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి కష్టపడుతున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు, సవాళ్లపై నిశిత పరిశీలన చేస్తూ ముందడుగు వేస్తున్నారు.
బీవై ఫేండేషన్ తో సేవా కార్యక్రమాలు
ఓవైపు ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే.. ఇంకోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ పథకాల అమలుకు కృషి చేస్తున్నారు. సామాజిక సేవ తత్పరతతో జీవై ఫౌండేషన్ సేవా సంస్థను నెలకొల్పారు యోగానంద్. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో, లాక్ డౌన్ కాలంలో సేవా భారతి, రోటరీ, వీఎఫ్ఈ, వీబీఎఫ్ వంటి సంస్థలతో కలిసి పనిచేసి.. వేలాదిగా నిరుపేదలకు ఆహారం, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లతో పాటు.. అవసరమైన వారికి నగదు సాయం చేసిన ప్రజల మనిషిగా గుర్తింపుపొందారు యోగానంద్. జీవై ఫౌండేషన్ ను విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కరోనా వారియర్స్ ఇంటర్నేషనల్ పురస్కారంతో గుర్తించింది. అంతేకాదు, పౌర సమస్యల పరిష్కారానికి పౌండేషన్ ద్వారా సిటిజన్ కన్సల్టేషన్ సెంటర్ ను నెలకొల్పారు. విద్యారంగం, మౌలిక వసతులు, ప్రజా రవాణా, ట్రాఫిక్ సమస్యలు వంటి నిర్దిష్ట పౌర సమస్యల పరిష్కారం కోసం ఇది కృషి చేస్తుంది.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
అప్ స్టెప్ కార్యక్రమంతో స్కూళ్లలో డిజిటల్ లెర్నింగ్ వ్యవస్థకు తోడ్పాటు అందించారు యోగానంద్. లోటస్ పాండ్ పునరుద్ధరణలో అత్యంత కీలక పాత్ర వహించారు. జల సంపదే జాతికి మూలం అన్న సత్యాన్ని విశ్వసించిన ఆయన.. శేరిలింగంపల్లి నియోజికవర్గంతో పాటు జంట నగరాల్లోని చారిత్రక చెరువుల పరిరక్షణకు నడుం బిగించారు. ఆక్రమణలపై పోరుబాట పట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కష్టపడుతున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.