బీఆర్ఎస్ రాష్ట నాయకుడు, ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 22 సంవత్సరాలుగా పార్టీకి సైనికుడిలా సేవలందించినా పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2001లో సీఎం కేసీఆర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభ్యున్నతికి కృషి చేశానని చెప్పారు.
2014లో పటాన్ చెరు జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకుంటే తాను ధైర్యంగా జడ్పీటీసీగా పోటీ చేసి భారీ మెజార్టీ సాధించినట్లు తెలిపారు. తన స్వగ్రామం చిట్కుల్‌లో రెండు ఎంపీటీసీలను గెలిపించానని అందులో తన తల్లి రాధమ్మ ఒక్కరని వెల్లడించారు. తర్వాత 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు అలుపెరుగని కృషి చేశానన్నారు.
పార్టీ అభివృద్ధి కోసం తన ఆస్తులను సైతం అమ్మి కోట్ల రూపాయలను వెచ్చిస్తే తనను గుర్తించకపోవడం, ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోవడం బాధకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రచారం నిర్వహిస్తే ఓర్వలేని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనపై అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల కోసం తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం చింపివేశారని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు.