కరీంనగర్ (Karimnagar) జిల్లా జమ్మికుంట (Jammikunta)లో జరగనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(Rajnath Singh) బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్న హూజరాబాద్ (Huzurabad) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajendar).. సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గజ్వేల్ (Gajwel) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పిన మాట ఆషామాషీ కాదని.. కచ్చితంగా బరిలో నిలిచి సీఎం కేసీఆర్ (CM KCR)ను ఓడిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయమని మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల చేసిన సవాల్‌పై స్పందించిన ఈటల.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు.. రూ.వందల కోట్లు ఖర్చుపెట్టిన ఓడిపోయారని ఎద్దేవా చేశారు. నన్ను ఓడించడమే లక్ష్యంగా ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు రాత్రి పగలు శ్రమించారని, అధికార యంత్రాంగం మొత్తాన్నితనపై కేంద్రీకరించినా తన గెలుపును ఆపలేక పోయారని ఈటల గుర్తు చేశారు.
ఆ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ను ఓడించటమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించానన్నారు. కాగా 22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నేను ప్రజల మద్దతు, ఆశీర్వాద బలం కలిగిన నాయకుడినని, మంచి, చెడులు తెలుసుకొని స్టేట్మెంట్లు ఇస్తానని అన్నారు. మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి బహిరంగ సభకి భారీ బందోబస్తు మధ్య ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఈటల అన్నారు.