తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) టీడీపీ (TDP) బరిలోకి దిగుతోందని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (kasani Gnaneshwar) తెలిపారు. తెలంగాణలో టీడీపీ ఖతం అంటూ వస్తోన్న వార్తల పై స్పందించిన కాసాని, ఆ వార్తలలో నిజం లేదని పేర్కొన్నారు. టీడీపీకి ప్రజా బలం లేకుంటే బాబు అరెస్ట్ విషయంలో ఇంత స్పందన ఉండేది కాదని, ఎందరో ఆయన అరెస్ట్ ను ఖండించారని వెల్లడించారు.
ఇక కాంగ్రెస్ Congress) కంటే టీడీపీనే బలంగా ఉందని, అభ్యర్థులతో లిస్టు కూడా రెడీ చేశారని జ్ఞానేశ్వర్ తెలిపారు. మరి కొంత మందిపై సర్వేలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇతర పార్టీల నుండి.. టీడీపీలోకి వచ్చేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది త్వరలో తెలుస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో తమ పార్టీ నేత బాలకృష్ణ ప్రచారం చేస్తారని వివరించారు.
మరోవైపు అభ్యర్థుల జాబితాతో పాటు టీడీపీ మేనిఫెస్టో కూడా త్వరలోనే విడుదల చేస్తామని కాసాని తెలిపారు. కాగా శనివారం రాజమండ్రి జైలులో చంద్రబాబుతో భేటీ అయినట్టు పేర్కొన్న కాసాని, చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేసి, అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై దేశమంతా ఆందోళనలో ఉందన్న ఆయన త్వరలోనే బాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.