– రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతులు
– షాద్ నగర్ బరోడా బ్యాంక్ దగ్గర ఉద్రిక్తత
– నినాదాలతో హోరెత్తించిన అన్నదాతలు
– కోడ్ నేపథ్యంలో ఆగిన పథకం
– ఎన్నికల తర్వాతేనన్న ప్రభుత్వం
– కావాలనే లేట్ చేశారంటున్న ప్రతిపక్షం
రైతుల రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. చాలా కాలం తర్వాత ఈమధ్యే ఈ హామీపై కీలక అడుగులు పడ్డాయి. కానీ, అదికూడా మూడ్నాళ్ల ముచ్చట మాదిరిగా అయిందనే విమర్శలు ఉన్నాయి. దళితబంధు, బీసీ బంధు, గృహ లక్ష్మి ఇలా చాలా పథకాలకు ఎన్నికల కోడ్ కారణంగా బ్రేక్ పడింది. అయితే.. నిధుల లేమి కారణంగా ఈ పథకాలను ఎప్పుడో ముందుకు సాగకుండా చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కోడ్ వచ్చే వరకు ఆపి.. కొద్ది రోజులు హడావుడి చేసి.. మళ్లీ తమ గవర్నమెంట్ వస్తే ఇస్తాం అని కేసీఆర్ సర్కార్ మాయ చేస్తోందని మండిపడుతున్నారు. ఎప్పుడో చేయాల్సిన రుణమాఫీ విషయంలోనూ ఇంతే చేశారని.. చాలామంది రైతులకి రుణమాఫీ అవ్వలేదని అంటున్నారు. ఈ క్రమంలో రైతు రుణమాఫీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు రైతులు ఆందోళనకు దిగారు.
దాదాపు 2 వేల మంది బ్యాంకు ఖాతాలు ఉన్న ఏ ఒక్కరికి రైతు మాఫీ చేయలేదని.. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని షాద్ నగర్ పట్టణంలో పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రుణమాఫీ కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఎన్నికల సమయంలో ఎలాగైనా రుణమాఫీ జరుగుతుందని రైతులు భావించారు. కానీ, వాళ్ల ఆశలు అడియాశలే అయ్యాయి. ఎన్నికల్లో రైతుల నుంచి బీఆర్ఎస్ కు ఎఫెక్ట్ తప్పదని హెచ్చరిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.