బీఆర్ఎస్ (BRS) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తన సెంటిమెంట్ నియోజకవర్గమైన హుస్నాబాద్ (Husnabad) లో ఆదివారం ఎన్నికల సమరభేరి మోగించారు. కలిసొచ్చిన ఉద్యమాల గడ్డ హుస్నాబాద్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన మంగళవారం సిరిసిల్ల (Sirisilla) పట్టణంలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు.
మొదట సిరిసిల్ల సభలో పాల్గొన్న కేసీఆర్ తర్వాత సిద్దిపేట సభకి కూడా హాజరవనున్నారు. ఇందుకు రెండు పట్టణాలు ముస్తాబయ్యాయి. మరోవైపు సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు మంత్రి కేటీఆర్ (KTR) నేతృత్వంలో ముఖ్య నాయకులంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కాగా సిరిసిల్ల పట్టణంలో జరిగే సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది. నేతన్నలకు ఎలాంటి వరాలు ఇస్తారనే చర్చ సాగుతోంది.
సిరిసిల్ల పట్టణంలో ఎక్కడ చూసిన గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లతో నిండిపోయింది. సభకి జిల్లా నలుమూలల నుంచి లక్ష మందిని తరలించాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ నేతలు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సిద్దిపేట బిడ్డ సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలకాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు సిద్దిపేటలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.